దీపిక నిజమైన హీరో

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణె సంఘీభావం ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ‘బాయ్‌కట్‌ ఛపాక్‌’, ‘ఐ సపోర్ట్‌ దీపికా’, ‘ఛపాక్‌ దేఖో తపాక్‌ సే’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో భారీ చర్చలే నడిచాయి.

Updated : 09 Jan 2020 08:12 IST

జేఎన్‌యూ విద్యార్థులకు అగ్రనటి సంఘీభావంపై ప్రశంసలు

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణె సంఘీభావం ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ‘బాయ్‌కట్‌ ఛపాక్‌’, ‘ఐ సపోర్ట్‌ దీపికా’, ‘ఛపాక్‌ దేఖో తపాక్‌ సే’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో భారీ చర్చలే నడిచాయి. ఆమె తదుపరి చిత్రాన్ని బహిష్కరించాలని భాజపా ఎంపీ రమేశ్‌ బిధురి పిలుపునివ్వగా... ‘దీపికా నిజమైన హీరో’ అని దర్శకుడు విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత దర్శకుడు మహేశ్‌ భట్‌, నటుడు సోనాక్షి సిన్హ, నిర్మాత అపర్ణాసేన్‌ తదితరులు ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేశారు.

న్యాయం మౌనం వహించింది: అమర్త్యసేన్‌
జేఎన్‌యూలో హింస పట్ల నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ స్పందించారు. ఈ విషయంలో న్యాయం మౌనం వహించిందని, పోలీసులు ఇప్పటివరకూ నిందితులను పట్టుకోనే లేదని అన్నారు. బాధితులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనడమేంటని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు.

వీసీకి హెచ్‌ఆర్‌డీ హితబోధ
తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) ఉన్నతాధికారులతో ఉపకులపతి జగదీశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. క్యాంపస్‌లో సుహృద్భావ వాతావరణం నెలకొల్పేలా అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడాలని అధికారులు సూచించారు. జేఎన్‌యూలో దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా పలు వర్సిటీలు, విద్యాసంస్థల్లో ప్రదర్శనలు జరిగాయి. దాడికి పాల్పడినవారికి సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని