టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఇద్దరు సభ్యుల బృందం  అమరావతిలో పర్యటించనుంది. ఈనేపథ్యంలో కమిషన్‌ సభ్యులు ఆదివారం ఉదయం గుంటూరు చేరుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై

Published : 12 Jan 2020 09:00 IST

1. గుంటూరు చేరుకున్న మహిళా కమిషన్‌ బృందం

జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఇద్దరు సభ్యుల బృందం  అమరావతిలో పర్యటించనుంది. ఈనేపథ్యంలో కమిషన్‌ సభ్యులు ఆదివారం ఉదయం గుంటూరు చేరుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కమిషన్‌ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావాల్సి ఉన్నప్పటికీ  పర్యటన ఆదివారానికి వాయిదా పడింది.

2. 3,112 స్థానాలు 30,800 నామినేషన్లు

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు మూడు రోజుల గడువే ఉండటంతో ఆశావహుల్ని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలో 120 పురపాలక సంఘాల్లో 2,727 వార్డులు, పది నగరపాలక సంస్థల్లోని 385 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 30,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. గణతంత్ర దినోత్సవం విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

గణతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 26న విశాఖపట్నంలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలోనే ఈ వేడుకలు నిర్వహించాలని, అక్కడి అధికారులకు సూచించారు.

4. 20న శాసనసభ ప్రత్యేక సమావేశం!

ఏపీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఈనెల 20న నిర్వహించనున్నారని సమాచారం. ఈ సమావేశంలోనే రాష్ట్ర రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదికలతో పాటు వీటిని అధ్యయనం చేసి ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే నివేదికపైనా చర్చించనున్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికా చర్చకు రావచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పుర ఎన్నికలు.. నా పనితీరుకు తీర్పు: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో జరిగే పురపాలక, నగర పాలక ఎన్నికలను తన పనితీరుకు పరీక్షగా భావిస్తున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. తెరాస హయాంలో పురపాలక సంఘాలకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, అందులో 10 శాతమైనా ఇచ్చారా అని తాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సవాలు చేస్తున్నానని చెప్పారు. కేటీఆర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి 

6. అన్నీ అమరే వేళ తరలింపు ఏల!

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు, ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారీ కసరత్తు జరిగింది. కోర్‌ కేపిటల్‌ నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తూ... మిగిలిన నగర నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించింది. ఫలితంగా భారీగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూ. వేల కోట్ల విలువైన ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. ఇప్పుడు ఈ కీలక సమయంలో రాజధానిని మారిస్తే అంతా మొదటికొస్తుంది. పెట్టుబడులకు, కార్యాలయాల నిర్మాణాలకు ముందుకొచ్చిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై కథనం కోసం క్లిక్‌ చేయండి 

7. ఆకాశవీధిలో.. రయ్‌ రయ్‌..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో అత్యాధునిక రవాణా సదుపాయం కార్యరూపం దాల్చనుంది. అత్యంత రద్దీగా ఉండే కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి ఐటీ కారిడార్‌ను చుడుతూ గచ్చిబౌలి మీదుగా అవుటర్‌లో మెట్రో రెండోదశకు అనుసంధానం చేసే 19 కి.మీ. మేర ఎలక్ట్రిక్‌ బస్సులు తిరిగేలా ఆకాశ బస్సు మార్గం ఏర్పాటుకు (ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిస్ట్‌ సిస్టమ్‌-ఈబీఆర్‌టీఎస్‌) సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సీఏఏను ఒప్పుకోం: మమతా బెనర్జీ

ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర నిరసన ఎదురైంది. అనేకమంది ఉద్యమకర్తలు ఆయన రాకను నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏని) ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం కోల్‌కతా చేరుకున్న ప్రధానితో ఆమె రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. రోదసిలోకి రాజాచారి!

చంద్రుడు, అంగారకుడు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా (ఐఎస్‌ఎస్‌)నికి చేపట్టబోయే యాత్రల్లో హైదరాబాద్‌ మూలాలున్న వ్యోమగామి రాజాచారి (41) భాగస్వామి కానున్నారు. వీటికోసం అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన 11 మందిలో ఆయన కూడా ఒకరు.  వ్యోమగామి ఎంపిక కోసం 2017లో నాసా ఇచ్చిన పిలుపునకు స్పందించి 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కఠిన ఎంపిక, శిక్షణ ప్రక్రియలో చివరికి రాజాచారి సహా 11 మందే మిగిలారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. స్వర్ణ నందిని

ఖేలో ఇండియా క్రీడల మూడో సీజన్‌లో తెలంగాణ అథ్లెట్‌ నందిని అదరగొట్టింది.  శనివారం అండర్‌-17 బాలికల లాంగ్‌జంప్‌లో సత్తాచాటి పసిడి సొంతం చేసుకుంది. అయిదో ప్రయత్నంలో 5.65 మీటర్ల దూరం దూకిన ఆమె ఈ సీజన్‌లో రాష్ట్రానికి తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని