ఒంటరితనం... చాలా చెడ్డది...

పొగతాగటం, ఊబకాయం మాదిరిగానే ఒంటరితనం కూడా వ్యక్తుల జీవితంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

Published : 14 Jan 2020 00:55 IST

న్యూయార్క్‌: పొగతాగటం, ఊబకాయం మాదిరిగానే ఒంటరితనం కూడా వ్యక్తుల జీవితంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ప్రత్యేకించి వయస్సు మళ్లుతున్న వారిలో ఇది ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తోంది. ప్రస్తుత సమాజంలో వయస్సు మళ్లినవారు వృద్ధాశ్రమాలకు తరలడం సర్వసాధారణమౌతోంది. ఈ పరిస్థితులపై యూనివర్సిటీ ఆఫ్‌ శాన్‌ డియాగోకు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వయస్సుతో పాటు వచ్చే బలహీనత, సామాజిక నైపుణ్యాల తగ్గుదల వృద్ధులలో ఒంటరితనానికి దారితీస్తున్నాయట. ఏ విషయం మీదా ఆసక్తి లేకపోవటం, జీవితం అర్ధవంతంగా, ఆశావహంగా లేకపోవటం, జీవితం మీద నియంత్రణ లేకపోవటం వంటివి ఒంటరితనానికి చిహ్నాలు. 

ఒంటరితనానికి కారణాలేంటి? 
జీవిత భాగస్వాములను, బిడ్డలను, స్నేహితులను కోల్పోవటం తమ ఒంటరితనానికి కారణం అని కొందరు చెప్పారు. ఈ వయస్సులో కొత్త స్నేహితులు లభించినప్పటికీ, కోల్పోయిన సన్నిహితుల లోటు తీర్చలేనిదని వారు వివరించారు. అయితే జీవితానికో అర్థం, లక్ష్యం లేకపోవటమే తాము ఒంటరితనం అనుభవించటానికి కారణమని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఎదుర్కోవటం ఎలా?
విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం, జాలి, దయ కరుణ వంటి పాజిటివ్‌ లక్షణాలను కలిగిఉండటం ద్వారా ఒంటరితనాన్ని ఎదుర్కోవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. అంతేకాకుండా వయస్సు పెరగటం అనేది చాలా సాధారణ లక్షణం అని అంగీకరించటం, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం కూడా ఒంటరి భావనను జయించటానికి ఉపయోగపడతాయి. ఒంటరితనం అనే భావన కలగటానికి గల కారణాలను తెలుసుకోవటం ద్వారా వృద్ధుల్లో ఆరోగ్యం, సంక్షేమం, ఆయుష్షు పెరగటానికి దోహదం చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని