టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

సంక్రాంతి సంబరాలు అమరావతిలో నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు

Published : 14 Jan 2020 09:00 IST

1. భోగి మంటల నడుమ అమరావతి నిరసనలు

సంక్రాంతి సంబరాలు అమరావతిలో నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. భాజపాతో తెరాస మిలాఖత్‌!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆరేళ్ల తెరాస పాలనలో పట్టణాల్లోని అంతర్గత రోడ్లను పైపులైన్ల పేరిట తవ్వేయడం తప్ప చేసింది శూన్యమని ఆరోపించారు. కార్లు పడిపోయే ఫ్లై ఓవర్లను కాంగ్రెస్‌ ఎప్పుడూ కట్టలేదన్నారు. పురపాలక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. భాజపాతో మిలాఖత్‌ అయింది తెరాసనే అని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అమరావతి బండి.. పట్టాలు తప్పించకండి

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని దేశంలోని అన్ని నగరాలతో అనుసంధానం చేయడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థను ఆలంబనగా తీసుకుంది. అద్భుత అంకుర నగరాన్ని.... చెన్నై-విజయవాడ-విశాఖ, హైదరాబాద్‌-గుంటూరు-విజయవాడ ప్రధాన మార్గాలతో కలపడానికి ఎర్రుపాలెం-నంబూరు, అమరావతి-పెద్దకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట కొత్త రైల్వే లైన్లను సాధించింది. దిల్లీ స్థాయిలో కొద్దిమేరకు ప్రయత్నం చేస్తే చాలు పనులు మొదలుపెట్టొచ్చు. ఇలాంటి తరుణంలో రాజధానిని మారిస్తే రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కాగితాలపై పరిమితమయ్యే ప్రమాదముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అప్పులు కట్టలేని రైతులు ఫోన్‌ చేయండి

వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగి అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న రైతులు తమకు ఫోన్‌ చేసి సమస్యను వివరిస్తే పరిష్కరం చూపిస్తామని తెలంగాణ ‘రాష్ట్ర రైతు రుణ ఉపశమన కమిషన్‌’ సభ్యుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, భార్యాబిడ్డలను అనాథలను చేయవద్దని, రైతులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. కమిషన్‌కు ఫోన్‌ చేయవలసిన నెంబర్లు 040 23393532, 98664 49988, 94407 87726, 93475 80252, 90320 59947. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. భయం గుప్పిట్లో భైంసా

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణం భయం గుప్పిట్లో వణుకుతోంది. సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు పట్టణంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణల అనంతరం సోమవారం భైంసాలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. భైంసాలో జరిగిన ఘటనను భాజపా తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం నిర్మల్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. తప్పుదోవ పట్టిస్తున్న మోదీ, షా

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)పై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. వాటిపై వారు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన 20 పార్టీలకు చెందిన నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొన్ని నెలల్లో జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)ను రూపొందిస్తారని, అనంతరం దాని ఆధారంగా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని తీసుకొస్తారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ప్రస్తుత పరిణామాలు విచారకరం

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తొలిసారిగా స్పందించారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్నది విచారకరం. మంచిది కాదు. భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్‌ వలసదారుడు ఇన్ఫోసిస్‌ తదుపరి సీఈవో అయితే చూడాలనుంది’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ముషారఫ్‌ మరణశిక్ష రద్దు!

ప్రవాసంలో ఉన్న పాకిస్థాన్‌ మాజీ సైనిక నియంత ముషారఫ్‌(74)కు లాహోర్‌ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆరేళ్ల విచారణానంతరం ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గత నెల 17న ఆయనకు విధించిన మరణశిక్ష రద్దయింది. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టడం నుంచి విచారణ వరకు సమస్తం.. రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ఉందని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ప్రకటించింది. ముషారఫ్‌పై 2013లో నవాజ్‌ షరీఫ్‌ సర్కారు కేసు పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఉద్యోగాలకు మందగమనం సెగ

దేశంలో ఉద్యోగాల సృష్టికి ఆర్థిక మందగమనం అవరోధం అవుతోంది. 2018-19లో కొత్తగా 89.7 లక్షల ఉద్యోగాల సృష్టి జరగ్గా, 2019-20లో ఇంతకంటే 16 లక్షలు తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. మరోవైపు ‘ఓయో’ భారత్‌లో 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించే ఉద్దేశంలో ఉంది. వ్యాపార విభాగాలు, కార్యకలాపాల బృందాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుంది. భారత్‌లో 56 మంది ఉద్యోగులను వాల్‌మార్ట్‌ ఇండియా తొలగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సై అంటే సై

ఏకపక్ష సమరాలతో విసిగిపోయిన భారత క్రికెట్‌ అభిమానులకు మంచి మజానిచ్చే పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచే భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో తలపడబోతోంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కంగారూ జట్టుతో కోహ్లీసేనకు సవాలు తప్పకపోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని