టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. హైపవర్‌ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపవచ్చని మంత్రులు సూచించారు. ఇప్పటి వరకూ

Updated : 16 Jan 2020 13:02 IST

1. రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ

రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. హైపవర్‌ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపవచ్చని మంత్రులు సూచించారు. ఇప్పటి వరకూ 3100 మంది రైతులు తమ అభిప్రాయాలను తెలిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 17 వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పండగ రోజూ నిరసనల హోరు

పండగ రోజున కూడా అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఏకైక డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 30వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతుల మహా ధర్నా, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు నిర్వహిస్తోన్న దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలించక పోవడం దుర్మార్గం అని రైతులు మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ‘ఆ ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలి’

కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలను నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డి ఘాట్‌ వద్ద శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జైపాల్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జనసేన, భాజపా కీలక భేటీ ప్రారంభం

ఇటీవల భాజపా అధినాయకత్వం నుంచి పిలుపుతో దిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో జనసేన, భాజపాకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ రకంగా కలిసి ముందుకెళ్లాలనే అంశంపై ఇరు పార్టీల నేతలు నిర్ణయించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మీకు చేతకాకపోతే.. తప్పుకోండి!: కన్నా

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అనుభవరాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ విమర్శించారు. అమరావతి అంశంలో గత ప్రభుత్వం  విఫలమైందని, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు అసమర్థులని వారే ఒప్పుకుంటున్నారని చెప్పారు. ‘‘మీకు రాజధాని నిర్మించడం చేతకాకపోతే తప్పుకోండి... మేము కట్టి చూపిస్తాం’’అని కన్నా వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

6. రష్మిక నివాసంలో ఐటీ సోదాలు

కథానాయిక రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి. రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, హిట్ అందుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. రెండు రోజుల బ్యాంకు సమ్మె.. ఎప్పుడంటే...

దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)తో తమ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని వారు వివరించారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో తాము సమ్మె చేయనున్నామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బీయు) ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో బ్యాంకులు ఈ విధంగా సమ్మె నిర్వహించటం ఇది రెండవసారి కానుంది. 

8. రూ.1.37లక్షలు సంపాదించిన నిర్భయ దోషులు

నిర్భయ దోషులకు ప్రాణభయం పట్టుకుంది. ఈ భయంతోనే నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తన సెల్‌లో విరామం లేకుండా నడుస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అయితే జైల్లో ఉంటున్న దోషులకు రోజువారీ పనులు కేటాయిస్తారు. అవి చేసినందుకు గాను వాళ్లకు వేతనాన్ని చెల్లిస్తారు. అలా ముకేశ్‌ మినహా ముగ్గురు దోషులు చేసిన పనికి గాను వాళ్లు రూ.1.37లక్షలు సంపాదించారు. అక్షయ్‌ జైల్లో పని చేసి రూ.69వేలు సంపాదించగా, పవన్‌ రూ.29వేలు, వినయ్‌ రూ.39వేలు సంపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆ విషయం మా జీవిత భాగస్వాములతో చర్చించాలి

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా 10 నెలల సమయం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ మరో మూడేళ్ల తర్వాత జరగబోయే 2023 వన్డే ప్రపంచకప్‌పై అప్పుడే కన్నేశారు.  ‘ఈ విషయంపై మేమిద్దరం మా జీవిత భాగస్వాములతో చర్చిస్తామని అనుకుంటున్నా. అప్పటికి మాకు 36, 37 ఏళ్లు ఉంటాయి. ఇప్పటికే నాకు ముగ్గురు పిల్లలున్నారు. అదే నా చివరి ప్రపంచకప్‌. ఈ మూడేళ్లలో ఫామ్‌ను కొనసాగిస్తూ, భార్యను, కుటుంబాన్ని చూసుకోవాలి’ అని వార్నర్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సెనేట్‌కు చేరిన ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసన ప్రక్రియ అక్కడి పెద్దల సభ సెనేట్‌కు చేరింది.​ అభిశంసన విచారణను సెనేట్‌కు పంపే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జరిగిన ఓటింగ్‌లో 228 మంది సభ్యులకుగానూ 193 మంది ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటేశారు. వచ్చే వారం సెనేట్‌లో జరిగే అభిశంసన విచారణ కోసం స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రత్యేక న్యాయ మండలిని ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని