
రాజధానిలో 144 సెక్షన్‌పై హైకోర్టు విచారణ
అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజధాని గ్రామాలు, విజయవాడలో నిషేధాజ్ఞలు అమలుపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధాని మహిళలు, రైతులు, న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్లతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించారు. అన్ని పిటిషన్లను కలిపి న్యాయస్థానం విచారణ చేస్తోంది. మరోవైపు, రాజధానిలో ఆందోళనలు 31వ రోజూ కొనసాగుతున్నాయి. తాము ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి పోలీసులు తమ పట్ల అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరంగా ఉందని.. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు కోర్టుకు తెలిపారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న తమపై పోలీసులు దాడి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీనివల్ల రాజధాని ప్రాంతంలో నిరసనలు తెలియజేసే అవకాశం లేకుండా పోయిందని, తమపై నిర్బంధ కాండ కొనసాగుతోందని వాపోయారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ని ఉపసంహరించుకొనేలా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. పోలీసులు, రైతుల తరఫున వాదనలను న్యాయమూర్తులు వింటున్నారు. కాసేపట్లో దీనిపై తీర్పు వెలువడనుంది.
Advertisement