సీఎం జగన్‌కు హైపవర్‌ కమిటీ ప్రజెంటేషన్‌!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశంపై ...

Updated : 17 Jan 2020 16:14 IST

ముఖ్యమంత్రితో ముగిసిన కీలక భేటీ

రేపు మరోమారు భేటీ కానున్న హైపవర్‌ కమిటీ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎంతో పలు కీలక అంశాలపై చర్చించారు. జీఎన్‌రావు, బీసీజీ నివేదికలపై చర్చించేందుకు గతంలో మూడు సార్లు భేటీ అయిన ఈ కమిటీ వేర్వేరు ప్రతిపాదనలను రూపొందించింది. వీటిని ప్రజెంటేషన్‌ రూపంలో కమిటీ సభ్యులు సీఎంకు వివరించినట్టు సమాచారం. ఈ ఉదయం 11గంటల సమయంలో ప్రారంభమైన ఈ భేటీలో 10 మంది మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొని చర్చించారు. రేపు మరోసారి హైపవర్‌ కమిటీ భేటీ కానుంది. అంతర్గతంగా సమావేశమై తుది నివేదికను కమిటీ రూపొందించనుంది. రెండ్రోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనుంది.

ప్రధానంగా గడిచిన మూడు సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు తమ అధ్యయనంలో వచ్చిన అంశాలను సీఎంకు వివరించినట్టు సమాచారం. మంత్రులు బుగ్గన, బొత్స తదితరులు ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలు, రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనలను సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది.హైపవర్‌ కమిటీ తొలి సమావేశంలో బీసీజీ, జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్న అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికను స్వయంగా ఆయనే హైపవర్‌ కమిటీకి వివరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలతో పాటు నాలుగు  కమిషనరేట్లు ఉండాలనే అంశాన్ని ఆయన కమిటీకి వివరించారు. రెండో దఫా సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల తరలింపుపై వచ్చిన ప్రతిపాదనలపై కీలకంగా చర్చించింది. వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులను చర్చించారు. మూడో సమావేశంలో పాలన వికేంద్రీకరణతో పాటు అమరావతి రాజధాని ప్రాంతం రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను చర్చించారు. ఈ మూడు భేటీల్లో జరిగిన చర్చలు, తమ అధ్యయన నివేదికలను ప్రజెంటేషన్‌ రూపంలో సీఎంకు వివరించింది. ఈ నెల 20న హైపవర్‌ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. 20న మంత్రివర్గ సమావేశంతో పాటు అదే రోజు అసెంబ్లీ కూడా భేటీ కానుంది. ఈ శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే రాజధాని అంశంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని