
మాంజాకు చిక్కి విలవిల్లాడిన పావురం
రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్: ప్రాణపాయంతో కొట్టుమిట్టాడుతున్న పావురం ప్రాణాల్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాకు దగ్గర్లోని వీధి దీపాల స్తంభంపై గాలిపటం మాంజాకు ఓ కపోతం చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా బయట పడలేకపోయింది. కిందకు వేలాడుతూ బాధతో విలవిల్లాడి పోయింది. అది చూసిన స్థానికులు, కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అదృష్టం కొద్ది అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శకటం రావడం గమనించిన స్థానికులు, విషయాన్ని సిబ్బందికి వివరించారు. వెంటనే స్పందించిన సిబ్బంది నిచ్చెన సాయంతో పైకి ఎక్కి మాంజాను తెంపి పావురాన్ని కాపాడారు. కాళ్లకు, రెక్కలకు చిక్కుకున్న మాంజాను విడదీసి గాల్లోకి వదిలేశారు. ఆపై గాల్లోకి ఎగురుకుంటూ పావురం వెళ్లిపోవడంతో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.