40కి.మీ. దాటితే బాదుడే

హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా అన్ని పైవంతెనలపై వేగ పరిమితి నిబంధన అమల్లోకి రాబోతుంది. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుల విభాగం దీనిపై కసరత్తు చేసి సూచిక బోర్డులు, నియంత్రికల ఏర్పాటు పనులు ప్రారంభించింది. సైబరాబాద్‌ పోలీసుల సూచనతో ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో 

Published : 20 Jan 2020 08:49 IST

అన్ని పై వంతెనలపై వేగపరిమితి నిబంధన

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా అన్ని పైవంతెనలపై వేగ పరిమితి నిబంధన అమల్లోకి రాబోతుంది. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుల విభాగం దీనిపై కసరత్తు చేసి సూచిక బోర్డులు, నియంత్రికల ఏర్పాటు పనులు ప్రారంభించింది. సైబరాబాద్‌ పోలీసుల సూచనతో ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో ప్రక్రియ మొదలైందని, నగరమంతా విస్తరిస్తుందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. వాహనదారులు గంటకు 40 కి.మీలకు మించి వేగాన్ని పుంజుకుంటే జరిమానా పడుతుందన్నారు. గతయేడాది చివర్లో బయోడైవర్సిటీ కూడలి పైవంతెనపై రెండు భారీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం, తాజాగా రాజీవ్‌గాంధీ కూడలి వంతెనపై ఆగి ఉన్న బైకును వేగంగా ఓ కారు ఢీకొట్టిన  దుర్ఘటనలతో యంత్రాంగం అప్రమత్తమైంది.

ప్రయోగాత్మకంగా..
నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద వివిధ మార్గాలు, కూడళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.700 కోట్ల విలువైన పనులు అందుబాటులోకి వచ్చాయి. మరో రూ.3 వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తయినవాటిలో అయ్యప్ప సొసైటీ కూడలి అండర్‌పాస్‌, మైండ్‌స్పేస్‌ కూడలి అండర్‌పాస్‌, కేపీహెచ్‌బీలోని రాజీవ్‌గాంధీ కూడలి పైవంతెన, ఎల్బీనగర్‌ కూడలి ఎడమవైపు పైవంతెన, బైరామల్‌గూడ చెక్‌పోస్టు కూడలి అండర్‌పాస్‌, కామినేని కూడలి ఎడమవైపు పైవంతెన ఉన్నాయి. వీటిలో బయోడైవర్సిటీ రెండోస్థాయి పైవంతెన గతయేడాది నవంబర్‌ 4న ప్రారంభం కాగా అదే నెల 9, 23 తేదీల్లో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సర్కారు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ మార్గదర్శకాల ప్రకారం మొత్తం పదిచోట్ల వేర్వేరు రకాల రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటయ్యాయి. మలుపుల వద్ద ప్రహరీపై అదనంగా 1.5 మీటర్ల ఎత్తున్న రెయిలింగ్‌ నిర్మించారు. రోడ్డు మీద థర్మో ప్లాస్టిక్‌తో గరిష్ఠంగా 40కి.మీ వేగంతో వెళ్లాలంటూ అక్షరాలు రాయించారు. 7 నిఘానేత్రాలు ఉన్నాయి. ఈనెల 4న ఈ వంతెనను తిరిగి ప్రారంభించారు. నెలరోజులు వాహనాల కదలికలను గమనించి తదుపరి నిర్ణయం తీసుకోవాలనేది కమిటీ ఆలోచన.

నిబంధనలకు విరుద్ధమంటూ..
బయోడైవర్సిటీ పైవంతెనపై మలుపునకు ముందు ఏర్పాటు చేసిన రబ్బర్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌పై ద్విచక్రవాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బండ్లు ఆగిపోతున్నాయని, నడుము నొప్పి వస్తుందని.. ఐఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ పరికరాలను తొలగించాలని కోరుతున్నారు. అయితే కెమెరాల సంఖ్య పెంచి, వేగ పరిమితి దాటిన ప్రతి వాహనానికి జరిమానా విధిస్తుండటంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని..కార్లు నిదానంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌గాంధీ కూడలి, మైండ్‌స్పేస్‌ కూడలి పైవంతెనల పైనా థర్మోప్లాస్టిక్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలన్న ట్రాఫిక్‌ పోలీసుల సూచన విషయాన్ని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌కు తెలిపినట్లు ఇంజినీరింగ్‌ విభాగం తెలిపింది. ఇక మీదట కొత్తగా నిర్మించే ప్రతి పైవంతెనపై వేగ పరిమితి సూచిక బోర్డులు, రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చామని, కమిషనర్‌ అనుమతి తీసుకుని పనులు చేపట్టామని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని