కీటో డైట్‌...నిజంగా మంచిదేనా?

కీటో డైట్‌కు మారుదామనుకుంటున్నారా? మరి దానిని గురించిన వివరాలు మీకు తెలుసా?

Published : 24 Jan 2020 00:55 IST

కీటో డైట్‌ గురించి వివరాలు మీకు తెలుసా?

వాషింగ్టన్‌: బరువు తగ్గాలనుకుంటున్నారా? కీటో డైట్‌కు మారుదామనుకుంటున్నారా?బరువు తగ్గడానికి కీటోజెనిక్‌ లేదా కీటో డైట్‌ అత్యుత్తమం అని భావించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే అదేమంత మంచిది కాదని మరికొందరు కొట్టి పారేస్తారు. మరి కీటో డైట్‌ ఆహార విధానాన్ని గురించి వివరాల్లోకి వెళితే...
అసలు కీటో డైట్‌ అంటే ఏమిటి?
ఆహారంలో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్‌, అధికంగా ప్రోటీన్లు, కొద్దిగా కొవ్వు పదార్ధాలు తీసుకోవటమే కీటో డైట్‌ విధానం. కీటో ఆహార పద్ధతిలో కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా లభించటంతో శరీరం తనకు అవసరమైన శక్తిని కొవ్వు నుంచి తీసుకుంటుంది. దీనిని పాటించినపుడు శరీరానికి అవసరమయ్యే రోజువారీ కెలోరీ విలువలో 70 నుంచి 80 శాతం కొవ్వు పదార్ధాల నుంచి, 20 శాతం ప్రోటీన్ల నుంచి మిగిలిన 5 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి. కీటో డైట్‌ విధానాన్ని మొదట్లో చిన్నపిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధి చికిత్సలో వాడేవారు. ఆధునిక కాలంలో 1994లో అమెరికాలో మళ్లీ ప్రాచుర్యం ప్రాధాన్యం పొండిన కీటో డైట్‌, 2007 కల్లా 45 దేశాల్లో విస్తరించింది. 

కీటో డైట్‌ తీసుకుంటే ఏం జరుగుతుంది?
ఈ విధానంలో బరువు అతిత్వరగా తగ్గే మాట నిజమే అయినప్పటికీ, వైద్య రంగం దీనివైపు అంత మొగ్గు చూపటంలేదు. కీటో ఆహార విధానం పాటించినప్పుడు శరీరానికి అత్యవసరమైన అనేక పోషకాలను తీసుకునే అవకాశం ఉండదు. కార్బోహైడ్రేట్లను తీసుకోవటం మానేయటం వలన కొన్ని రకాల విటమిన్లు, పోలీఫెనాల్స్‌, పీచుపదార్ధాలు శరీరానికి లభించవు. గుండె పనితీరుకు, ఆరోగ్యానికి ఆ పోషకాలు అతి ముఖ్యమైనవని శాస్త్రజ్ఞులు నొక్కి చెపుతున్నారు. పైగా కార్బోహైడ్రేట్లను తినకపోవటం వలన కొవ్వు మాత్రమే కాకుండా కండరాలు కూడా కరిగిపోతాయి. ఇది అభిలషణీయం కాదు. 
ఏం చేయాలి?
కీటో డైట్‌ పాటించే ముందు తమ ఆహార అలవాట్లలో ఈ విధంగా భారీ మార్పులు చేసుకోవటం అవసరమా అనే విషయం, దానిని అమలు చేయాలనుకునేవారు ఆలోచించుకోవాలి. కీటో వంటి ఆహార విధానాల వల్ల తగ్గిన బరువు, అది మానేసిన తరువాత మళ్లీ అంతే త్వరగా పెరగటానికి చాలా అవకాశాలున్నాయి. ఆహారంలో పిండి పదార్ధాలను తక్కువ చేస్తూనే కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, గింజలు వంటి వాటి శాతాన్ని పెంచటం ద్వారా బరువు తగ్గటం ఉత్తమం.

స్థిరంగా బరువు తగ్గటం అనేది మనం తీసుకునే ఆహార నాణ్యత మీద తప్ప, తీసుకున్న కాలరీల మీద ఆధారపడి ఉండదని ఆహార నిపుణులు తేల్చిచెప్పారు. బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మధ్య తేడాను గుర్తించాలని డైటీషియన్లు అంటున్నారు. బరువు తగ్గటానికి తాము ఎవరికీ కీటో డైట్‌ పాటించాలంటూ సలహా ఇవ్వబోమని అమెరికాలోని మౌంట్‌ సినాయి హెల్త్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు. అరోగ్యంగా ఉండటానికీ, బరువు తగ్గటానికీ ...మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటమే ఉత్తమమని వారు మరోసారి తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని