మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు.

Published : 24 Jan 2020 00:56 IST

హైదరాబాద్‌: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.75 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మేడారం సంస్కృతిని ప్రతిబింబించే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మేడారం జాతర ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. మేడారంలో మిగిలిన పనులు వేగంగా పూర్తి అయ్యేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లపై గతంలో పనిచేసిన అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకురావాలని మంత్రి సూచించారు. మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వస్తువులను వాడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. జాతరకు వచ్చే భక్తులు కూడా వనదేవతల ఆశీర్వాదం కోసం అడవిని రక్షించేందుకు.. ప్లాస్టిక్ నివారించేందుకు పూర్తిగా సహకరించాలని మంత్రి  సత్యవతి రాఠోడ్ కోరారు.

గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈసారి గతంకంటే మంచి ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. వారికి కావాల్సిన వసతులు కల్పించాలన్నారు. పదో తరగతి, ఇంటర్ తర్వాత నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు తగిన శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని