అందుకే ఆ సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ..!

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ గౌరవం కోరుకుంటాడు. మన చట్టాలు కూడా చెబుతున్నాయి. శవానికి కూడా గౌరవం ఇవ్వాలన్నది నైతిక నియమం.....

Published : 27 Jan 2020 14:41 IST

షరీఫ్‌ చాచా..నీకు సలాం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ గౌరవం కోరుకుంటాడు. మన చట్టాలు కూడా అదే చెబుతున్నాయి. శవానికి కూడా గౌరవం ఇవ్వాలన్నది నైతిక నియమం. కానీ, 130 కోట్ల జనాభా ఉన్న మన విశాల భారత దేశంలో విధి వక్రించి అభాగ్యులుగా మరణిస్తున్న వారెందరో. అలా నిరాదరణకు గురైన ఎంతో మంది అనాథ శవాలకు ఆసరాగా నిలుస్తున్నారు 82 ఏళ్ల షరీఫ్‌ చాచా. 27 ఏళ్లలో 25 వేల మంది అభాగ్యులకు దహనసంస్కారాలు నిర్వహించి వారికి మరణంలోనూ గౌరవాన్ని ప్రసాదించారు. అంతటి గొప్ప మనుసున్న చాచాని గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన నిస్వార్థ సేవకు సముచిత గౌరవం కల్పించింది. 

కదిలించిన కుమారుడి మరణం...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ షరీఫ్‌ చాచా స్వస్థలం. పెద్దగా చదువుకోని చాచా సైకిల్‌ మెకానిక్‌గా స్థిరపడ్డారు. 28 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత చెలరేగిన మత ఘర్షణల్లో ఆయన పెద్ద కొడుకు దుర్మరణం పాలయ్యాడు. కానీ, ఆ విషయం నెల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు తెలియరాలేదు. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయి అనాథలా తన కుమారుని శవం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసి షరీఫ్‌ చలించిపోయారు. తన కన్న కొడుకుకి పట్టిన గతి ఇంకెవరికీ రాకూడదని అప్పుడే సంకల్పం చేశారు. ఎక్కడ గుర్తు తెలియని మృతదేహాలు కనిపించినా సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అభాగ్యుల శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 25వేల అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. 

నిత్యం పోలీసు స్టేషన్ల చుట్టూ...

నిత్యం ఆస్పత్రులు, పోలీస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్చురీలను షరీఫ్‌ సంప్రదిస్తారు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 72 గంటల్లో ఎవరూ శవాన్ని తీసుకోవడానికి రాకపోతే తనకు అప్పగించాలని చెబుతారు. చాచా చేస్తున్న సేవను గుర్తించిన వారు ఆయనకు సహకరిస్తున్నారు. హిందూ, ముస్లింతో నాకు సంబంధం లేదు.. నా దృష్టిలో అందరూ మనుషులే అంటారు చాచా. ఆయన సేవల్ని గుర్తించి బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు అమీర్ ఖాన్‌.. 2012లో తన సత్యమేవ జయతే కార్యక్రమానికి పిలిచి చాచాని ప్రపంచానికి పరిచయం చేశారు.

తాను చేస్తున్న మెకానిక్‌ పనితో ఇళ్లు గడవడమే కష్టంగా ఉన్నా.. తన సేవకు మాత్రం ఏనాడూ స్వస్తి పలకలేదు. తాను సంపాదించే డబ్బులతో పాటు ఇరుగుపొరుగు ఇచ్చే స్వల్ప విరాళాలతో తన నిస్వార్ధ సేవకు కొనసాగిస్తున్న షరీఫ్‌ చాచాకు సలాం చెప్పాల్సిందే..! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని