ప్లాస్టిక్ కాలుష్యం.. రీసైక్లింగే మార్గం (ప్రకటన)

బిలియర్డ్స్‌ బాల్స్‌ తయారీ పేరిట జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఈ శతాబ్దంలో తెరపైకి వచ్చిన పదార్థం ఏమిటి?.. ఈ శతాబ్దంలో ఆవిష్కృతమై భూ మండలాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న

Published : 31 Jan 2020 02:30 IST

బిలియర్డ్స్‌ బాల్స్‌ తయారీ పేరిట జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఈ శతాబ్దంలో తెరపైకి వచ్చిన పదార్థం ఏమిటి?.. ఈ శతాబ్దంలో ఆవిష్కృతమై భూ మండలాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆవిష్కరణ ఏమిటి? ఈ రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం.. అదే ప్లాస్టిక్‌! భూ మండలానికి ప్లేగు వ్యాధిలా తయారైందీ ప్లాస్టిక్‌. 2018లో ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 16.5 మిలియన్‌ టన్నులు భారత్‌లోనివే కావడం గమనార్హం. ప్లాస్టిక్‌ను భూమి పొరల్లోకి పోనివ్వకూడదని ప్రభుత్వం చెబుతున్నా.. 40 శాతం ప్లాస్టిక్‌ భూమిలోకి, కాలువల్లోకి చేరుతుందనేది అసలు నిజం. అయితే, ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నిట్టూర్చే వారు కొందరైతే.. కొందరు చిరు పారిశ్రామిక వేత్తలుగా తమదైన అడుగులు వేస్తూ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాటిని ప్రజాపయోగ వస్తువులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములవుతూనే.. భూ పరిరక్షణకు ప్లాస్టిక్‌పై పోరాడుతున్నాలిలా..

ప్లాస్టిక్‌తో రోడ్లు..

బెంగళూరు వెళితే ప్లాస్టిక్‌తో వేసిన రోడ్లు మనకు దర్శనమిస్తాయి. 2002 నుంచి కేకే ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఈ నగరంలో సుమారు 2వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను వేసింది. ఇందుకోసం 10వేల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించింది. రోడ్లు వేసే సాంకేతికతపై ఏకంగా పేటెంట్‌ కూడా పొందింది. కేకే ప్లాస్టిక్‌ కంపెనీ ప్లాస్టిక్‌ పునర్వినియోగం/ పునరుద్ధధరణ ప్లాంట్‌ను బెంగళూరులో నడుపుతోంది. రోజూ 30 మెట్రిక్‌ టన్నుల చెత్తను ప్రాసెస్‌ చేస్తోంది. మరింత విస్తృత పరిశోధనల కోసం ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈసారి బెంగళూరు వెళ్లేప్పుడు అక్కడి రోడ్లను ఓ సారి పరిశీలించడం మరిచిపోవద్దు..

ఫర్నీచర్‌, బ్యాగులు, బొమ్మలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలు రీసైకిల్‌ అయ్యేవాటితో పోలిస్తే.. భూమిలో కలిసిపోయేవి అధికం. ఇది గుర్తించిన దిల్లీకి చెందిన దినేశ్‌ పరీఖ్‌, సచిన్‌ శర్మ 2013లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో వినూత్న వస్తువులను తయారుచేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. జీఈఎం ఎన్విరో మేనేజ్‌మెంట్‌ పేరిట ఓ సంస్థను నెలకొల్పారు. కర్భన ఉద్గారాలను తగ్గించడంతో పాటు చెత్త ఏరేవారికి ఈ సంస్థ సహకారం అందిస్తోంది. ప్లాస్టిక్‌ను సేకరించి దాన్ని ఫైబర్‌గా మార్చి వినియోగ వస్తువులుగా తీర్చిదిద్దుతున్నారు. వాడి పారేసిన బాటిళ్లను సేకరించేందుకు ఈ సంస్థ సుమారు 15 రాష్ట్రాల్లో 50 ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు లక్ష టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రాసెస్‌ చేసింది.

బిస్లరీ తన వంతుగా..

సాధారణంగా జనాల్లో ప్లాస్టిక్‌ని వ్యర్థంగా భావిస్తారు. కానీ అదో ఆస్తిగా ప్రజలు భావించేలా వారి ఆలోచన ధోరణి మారాలని బిస్లరీ సంస్థ ‘బాటిల్స్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది ముంబయి సహా పరిసర ప్రాంతాల్లో  ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించేందుకు కళాళాలు, హౌసింగ్‌ సొసైటీల్లో 200కు పైగా వర్కషాపులు నిర్వహించింది. 15 లక్షల మందిని ఇందులో భాగస్వాములను చేసింది. వచ్చే ఏడాది మరిన్ని మెట్రో నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని బిస్లరీ భావిస్తోంది. ఇప్పటికే 4800 టన్నుల ప్లాస్టిక్‌ రీసైకిల్‌ చేసి దాన్ని ఫ్యాబ్రిక్‌గా మార్చి హ్యాండ్‌ బ్యాగులు వంటి ఉత్పత్తులను తయారు చేసింది.

గిరిజనులకు ఉపాధి..

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో గిరిజనులకు ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు అమితా దేశ్‌ పాండే, నందన్‌ భట్‌. వృత్తిరీత్యా టెకీలైన వీరు ఐదేళ్ల క్రితం తమ ఉద్యోగాలను వీడి ఆరోహణ ఎకో సోషియల్‌ పేరిట ఓ సంస్థను నెలకొల్పారు. ప్లాస్టిక్‌తో ఫైల్‌ కవర్లు, గృహోపకరణ ఉత్పత్తులు, యోగా మేట్లను తయారీని ప్రారంభించారు. ఇందుకోసం గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. 2015 ఆగస్టు నుంచి 7,76,500 బ్యాగులను ఈ విధంగా రూపొందించారు. మహారాష్ట్రలో మరిన్ని గిరిజన గ్రామాలకు వెళ్లి అక్కడి గిరిజన మహిళలకు వీటి తయారీలో మెలకువలు నేర్పి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు.

రీసైక్లింగ్‌ ద్వారా 2030 నాటికి ఆరు రెట్ల అదనపు ఉద్యోగ కల్పన చేపట్టొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. తద్వారా రూ.14 లక్షల కోట్ల అదనపు ఖర్చును ఆదా చేయొచ్చని పేర్కొంటున్నాయి. అంటే దీని వాటా దేశ జీడీపీలో 11 శాతం. రీసైక్లింగ్‌ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ మార్కెట్‌ వాటా ప్రస్తుతం 25,600 మిలియన్‌ డాలర్లు కాగా.. 2025 నాటికి అది 41,200 మిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

ప్లాస్టిక్‌ అనేది అసలు సమస్యే కాదు. దాన్ని నిర్వహణ ఎలా అనేది అసలు సమస్య. దీనిపై ప్రపంచం ఇప్పటికే దృష్టి సారించింది. దీన్ని మరింత తీవ్రంగా పరిగణించాలి. వందేళ్ల క్రితం ప్లాస్టిక్‌ తమ జీవితాల్లో ఇంత మార్పు తీసుకొస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే, ప్లాస్టిక్‌పై మనం చేసే నేటి పోరాటం మరో వందేళ్లు గుర్తుండిపోవాలి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని