సకాలంలో పోలవరం పూర్తి చేయాలి

జలవనరుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సహా జలవనరులశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం సహా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Published : 04 Feb 2020 00:48 IST

అమరావతి: జలవనరుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సహా జలవనరులశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం సహా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో కరవు నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణను అధికారులు సీఎంకు వివరించారు. కాల్వల విస్తరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌, గోదావరి-కృష్ణా లింకేజీ తదితర ప్రతిపాదనల గురించి వెల్లడించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రణాళిక గురించి సీఎంకు వివరించారు.

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై తయారు చేసిన ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. గోదావరి-కృష్ణ అనుసంధానంలో వ్యయం తగ్గింపు సహా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యే మార్గాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వీటిపై మరింత అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాయలసీమలో కరవు నివారణ కోసం కాల్వల విస్తరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, చిత్రావతి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. పోలవరం మినహా ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు రూ.25,698 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాయలసీమ కరవు నివారణ పనుల కోసం రూ.33,869 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను పరిశీలించి తుది ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పోలవరం నుంచి విశాఖపట్నానికి నీటి తరలింపునకు ప్రత్యేక పైపులైను కూడా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని