
సీఎం జగన్‌తో రాజధాని రైతుల భేటీ
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన రైతులు సీఎంతో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు కల్పించాలని రైతులు సీఎం జగన్‌ను కోరారని.. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. 10 రోజుల్లో భూసేకరణ ఆదేశాలు ఉపసంహరించాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు ఆర్కే చెప్పారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో బలవంతంగా భూసేకరణ చేశారని.. 5వేల ఎకరాల భూసేకరణ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారని వివరించారు. మంగళగిరి-తాడేపల్లి నీటి పథకాలకు రూ.8కోట్లు కేటాయించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆర్కే తెలిపారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్లు అన్నీ తొలగిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని జగన్ చెప్పినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.