‘భవిష్యత్తులో ఆహారానికి భారీ డిమాండ్‌’

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వ్యవసాయ, ఆహార రంగాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు...

Published : 05 Feb 2020 00:55 IST

కేసీఆర్‌ విధానాలు ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్నాయి
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వ్యవసాయ, ఆహార రంగాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ అవసరాల మేరకు ఆధునిక సాంకేతిక సాయంతో మరో విప్లవం సృష్టించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్‌కు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 2030 నాటికి ఆహార కొరతలేని సుస్థిర అభివృద్ధి జరగాలంటే వ్యవసాయ రంగంలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

వ్యవసాయ, ఆహార రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగం అందిపుచ్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ఆర్థికస్థితి, సహజవనరుల యాజమాన్యాన్ని సంపూర్ణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లు దాటుతుందని, ఈ నేపథ్యంలో ఆహారానికి భవిష్యత్తులో భారీగా డిమాండ్ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉత్పత్తే కాకుండా ఉత్పాదకత మీద కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు.

ఆహార ఉత్పత్తి, వినియోగంపై పెరుగుతున్న పట్టణీకరణ తీవ్ర ప్రభావం చూపుతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ విధానాలు దేశంతోపాటు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో మొబైల్, రిమోట్ సెన్సింగ్, కంప్యూటర్లు కొంతవరకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో వీటి సేవలు మరింత వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు, ఐటీసీ డైరెక్టర్ శివకుమార్, ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ ప్రొఫెసర్ అశ్వినీ ఛాత్రే తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని