భక్త జనసంద్రంగా మేడారం పరిసరాలు

లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మేడారం జాతరలో రెండో రోజు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరించిన అనంతరం అమ్మవారికి ప్రీతి

Updated : 06 Feb 2020 11:55 IST

మేడారం: లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మేడారం జాతరలో రెండో రోజు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరించిన అనంతరం అమ్మవారికి ప్రీతి పాత్రమైన బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల వద్ద క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. బుధవారం అర్ధరాత్రి గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకోగా ఇవాళ సాయంత్రం సమ్మక్క చేరుకోనుంది.

తుపాకీ శబ్దాలే సంకేతం ...!
సమ్మక్క రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అంతా చిలకలగుట్ట వద్దనే వేచి ఉంటుంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం అక్కడికే చేరుకుంటారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కుంకుమ భరిణెను తీసుకొని కిందకు వస్తున్న సమయంలో జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ తుపాకీ శబ్దాలే సమ్మక్క ఆగమనానికి సంకేతం. ఇక ఆ క్షణం నుంచి ప్రతి ఘడియా అత్యంత విలువైనదే. భారీ బందోబస్తు మధ్య గద్దెల ప్రాంగణానికి పూజారులు ప్రయాణమవుతారు. రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది భక్తజనసందోహం.. జయజయ ధ్వానాల నడుమ తొలుత చలపయ్య చెట్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన అనంతరం  మేడారం మణిపూసగా విలసిల్లుతున్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అప్పుడే నిండు జాతరగా మారుతుంది. ఆ మరుక్షణం నుంచి  మొక్కుల చెల్లింపులు ప్రారంభమవుతాయి. తల్లి మనసారా ఇచ్చే ఆశీర్వాదాలను పదిలంగా తమ వెంట ఇళ్లకు తీసుకెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని