బండిపై హలో.. జైలుకి చలో..

చరవాణిలో మాట్లాడుతూ రోడ్లపై వెళ్తున్నారా?.. డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దుతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం.. ఎందుకంటే.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదిస్తుండడంతో

Updated : 10 Feb 2020 08:35 IST

చరవాణి మాట్లాడుతూ వాహనం నడిపితే కటకటాలకే
మెట్రో నగరాల్లో పెరుగుతున్న ప్రమాదాలు

 హైదరాబాద్‌: చరవాణిలో మాట్లాడుతూ రోడ్లపై వెళ్తున్నారా?.. డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దుతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం.. ఎందుకంటే.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదిస్తుండడంతో న్యాయమూర్తులు తీవ్రతను పరిశీలించి జరిమానాతోపాటు జైలుశిక్షలు విధిస్తున్నారు. చరవాణి చూస్తూ వాహనదారులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమై మూడు కమిషనరేట్ల పరిధుల్లో  ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. వాహనచోదకులు చరవాణిలో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, శిరస్త్రాణంలో ఫోన్‌ను ఉంచుకుని వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని పట్టుకుంటున్నారు. పోలీసులులేని చోట్ల కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

మాటల మూటలు.. ప్రమాదాల కారణాలు.. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న చోదకులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రత్యేక బృందాలు వాహనచోదకుల తీరును గమనిస్తున్నాయి. చరవాణితో మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు చోదకుల ప్రవర్తనల్లో మార్పులను బృందం సభ్యులు పరిశీలించారు. ఫోన్‌ మోగగానే... ద్విచక్రవాహనచోదకులు వెంటనే దాన్ని చేతికి తీసుకుని మరో చేత్తో వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు అవతలి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించకపోవడంతో ఫోన్‌ దగ్గరగా పట్టుకునే ప్రయత్నంలో యాక్సిలేటర్‌ ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు గతనెల తొలి పక్షంలో 63 కూడళ్లు, రహదారుల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న వారిని గుర్తించారు. ద్విచక్రవాహన చోదకుల్లో 80 శాతం మంది ఫోన్‌లో మాట్లాడుతుండగా కార్లలో వెళ్లే డ్రైవర్లు 40 శాతం మంది కారు నడుపుతూనే మాట్లాడుతున్నారని గుర్తించారు.

దిల్లీ.. ముంబయిలో అత్యధికం.. చరవాణుల్లో మాట్లాడుతూ వెళ్తున్న వాహనచోదకుల్లో దిల్లీలో ఎక్కువమంది ఉన్నారు. 2019 సంవత్సరంలో సగటున రోజుకు 43 కేసులు నమోదయ్యాయి. దిల్లీ తర్వాత ముంబయిలో అత్యధికంగా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని