ఆ ఆలోచనే ఐటీ టవర్‌గా మారింది: వినోద్‌

కరీంనగర్‌లో ఈ నెల 18న ఐటీ టవర్‌ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై..

Updated : 10 Feb 2020 14:57 IST

కరీంనగర్‌: కరీంనగర్‌లో ఈ నెల 18న ఐటీ టవర్‌ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ..  తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను ఎంపీగా, గంగుల కమలాకర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరీంనగర్‌లో ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆలోచించామన్నారు. ఆ రోజు తమ ఆలోచనే నేడు ఐటీ టవర్‌గా మార్పు చెంది అనేక కంపెనీలు వచ్చేందుకు దోహదం చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. ఐటీ టవర్‌తో కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణలోని విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. 

ఎంఎన్‌సీలు ఆసక్తి చూపుతున్నాయ్‌: గంగుల
ఐటీ టవర్‌ను ఈనెల 18న ఉదయం 10గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలోనే దీని ప్రారంభోత్సవం కొంచెం ఆలస్యమైనట్టు చెప్పారు. మొత్తం 12 కంపెనీలతో ఎంవోయూలు చేసుకొని ప్రారంభించాలని అనుకున్నామనీ.. కానీ ఇప్పటిదాకా 18 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తమను సంప్రదించాయని మంత్రి వివరించారు. ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చామనీ.. అందుకే అనేక ప్రాంతీయ కంపెనీలతో పాటు బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) కూడా ఇక్కడ  పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి, రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని