పౌరసత్వం వదులుకుంటే పత్రాలు చూపించండి

జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్లయితే అక్కడి అధికార వర్గాల డాక్యుమెంట్లు సమర్పించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని...

Published : 10 Feb 2020 18:41 IST

చెన్నమనేని కేసులో హైకోర్టు

హైదరాబాద్‌: జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్లయితే అక్కడి అధికార వర్గాల డాక్యుమెంట్లు సమర్పించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌పై  ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. చెన్నమనేనికి ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. చెన్నై నుంచి జర్మనీకి అక్కడి పాస్‌పోర్టుతోనే వెళ్లారని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. 

అయితే, తాను జర్మనీ పౌరసత్వం వదులుకున్నానని చెన్నమనేని హైకోర్టుకు నివేదించారు. భారత పౌరసత్వం ఉన్నప్పుడు జర్మనీ పాస్‌పోర్టుతో ఎందుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. పౌరసత్వం వదులుకోవడానికి ఇచ్చిన దరఖాస్తును జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా అని ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని తరఫు న్యాయవాదిని అడిగింది. జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్లయితే.. అక్కడి ప్రభుత్వ అధికారిక పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టేను హైకోర్టు రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని