వైరస్‌లు గబ్బిలాల్లోనే ఎందుకెక్కువ..?

ఆధునిక ప్రపంచాన్ని నిఫా, జికా, సార్స్‌, మెర్స్‌, ఎబోలా వంటి వైరస్‌లు కుదిపేశాయి. వీటి వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కొవిడ్‌-19(కరోనా వైరస్‌) కూడా ప్రపంచవ్యాప్తంగా.........

Updated : 12 Feb 2020 13:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధునిక ప్రపంచాన్ని నిఫా, సార్స్‌, మెర్స్‌, ఎబోలా వంటి వైరస్‌లు కుదిపేశాయి. వీటి వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కొవిడ్‌-19(కరోనా వైరస్‌) కూడా ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తోంది. అయితే వీటన్నింటిలో ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. ఇవన్నీ గబ్బిలాల నుంచే జంతువులకు.. వాటి నుంచి మనుషులకు వ్యాపించినట్లు పరిశోధనల్లో తేలింది. తాజాగా కొవిడ్‌-19 కూడా గబ్బిలం నుంచే వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నారు. కానీ, ఇది నిర్ధారణ కాలేదు. ఇవేగాక ఈ క్షీరదాల్లో మరికొన్ని ప్రాణాంతక వైరస్‌లు కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇన్ని ప్రాణాంతక వైరస్‌లు శరీరంలో తలదాచుకుంటున్నా గబ్బిలాలు ఎలా తట్టుకుంటున్నాయన్నది గత కొన్నేళ్లుగా పరిశోధకులను తొలచివేస్తోంది. 

అసలు కారణం...

గత సంవత్సరం ఈ అంశంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిగినట్లు జర్నల్‌ నేచర్‌ మైక్రోబయాలజీ పేర్కొంది. హానికర వైరస్‌ల నుంచి గబ్బిలం ఎలా తట్టుకోగలుగుతుందో దీంట్లో వివరించారు. ఏవైనా సూక్ష్మజీవులు మనుషులు లేదా ఎలుకలకు సోకినప్పుడు వెంటనే రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలకం(యాక్టివేట్‌) అవుతుంది. వాటిపై పోరాడేందుకు ‘ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌’ పుడుతుంది. అయితే ఈ స్పందన పరిమిత స్థాయిలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఒకవేళ రెస్పాన్స్‌ ఎక్కువైన పక్షంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వయసు సంబంధిత సమస్యలు కూడా చుట్టుముడతాయి. 

పరిశోధన సాగిందిలా...

ఇక గబ్బిలాల్లో ఈ ప్రక్రియ చాలా భిన్నంగా ఉన్నట్లు గమనించారు. ఎలాంటి వైరస్‌ సోకినా వచ్చే ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ గబ్బిలాల్లో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ‘ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌’కు కారణమయ్యే జీవక్రియ వీటి శరీరంలో మందగించినట్లు కనుగొన్నారు. సింగ్‌పూర్‌లోని డ్యూక్‌-ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌లో ఈ మేరకు పరిశోధనలు జరిపారు. మెలాకా వైరస్‌, మెర్స్, ఇన్‌ఫ్లుయెంజా-ఏ వైరస్‌ను గబ్బిలాలు, మనుషులు, ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించారు. మనుషులు, ఎలుకల్లో ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్ అధికంగా ఉండగా.. గబ్బిలాల్లో మాత్రం ఇది చాలా స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే సహజ రోగనిరోధక శక్తి గబ్బిలాల్లో అధికంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అందుకే ఎన్ని వైరస్‌లు తమ శరీరాల్ని ఆవాసంగా చేసుకొన్నా గబ్బిలాలు మనగలుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

ఎన్‌ఎల్‌ఆర్‌పీ3 ప్రోటీన్‌ పాత్ర... 

ఇక ‘ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌’ తక్కువగా ఉండడానికి ఎన్‌ఎల్‌ఆర్‌పీ3 ప్రోటీనే కారణమన్న విషయాన్ని కూడా కనుగొన్నారు. రోగనిరోధక కణాలు ఒత్తిడికి గురికావడం లేదా వైరస్‌లు సోకడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్‌ను ఈ ప్రోటీన్లు వెంటనే గుర్తిస్తాయి. గబ్బిలాల్లో ఈ ఎన్‌ఎల్‌ఆర్‌పీ3 ప్రోటీన్‌ అచేతనాత్మకంగా ఉండడంతో రోగనిరోధక కణాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ కూడా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. గబ్బిలాల పరిణామక్రమంలో ఈ మార్పు సంభవించినట్లు పేర్కొన్నారు. అయితే దీన్ని పక్కాగా ధ్రువీకరించడానికి ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు