నిరుద్యోగ యువతకు ఎన్టీపీసీ తోడ్పాటు

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఎన్‌టీపీసీ బాసటగా నిలుస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచితంగా లైట్‌ మోటారు వాహన డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తోంది.

Published : 13 Feb 2020 01:02 IST

విశాఖపట్నం: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఎన్టీపీసీ బాసటగా నిలుస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచితంగా లైట్‌ మోటారు వాహన డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తోంది. దీని కోసం గాజువాక ప్రభుత్వ ఐటీఐతో ఒప్పందం చేసుకుంది. ప్రమాదాలు నివారించేలా భారీ వాహనాల డ్రైవింగ్‌లోనూ యువకులు శిక్షణ పొందుతున్నారు. 

 

తక్కువ విద్యార్హతతో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఐటీఐలు ఏర్పాటు చేసింది. ఆ ఆలోచనను నిజం చేసేలా విశాఖలోని గాజువాక ఐటీఐ గ్రామీణ నిరుద్యోగ యువతకు భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణను ఇస్తోంది. 45 రోజులపాటు సాగే ఈ కోర్సులో బ్యాచ్‌కు 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తారు. మొదటి 15 రోజులు శిక్షణ తరగతుల్లో ట్రాఫిక్‌ నిబంధనలు, బ్యాటరీ, ఆయిల్‌ లెవల్‌, కూలెంట్‌ తనిఖీ, పంక్చర్‌ అయితే టైర్లు మార్చడం వంటి అంశాలను నేర్పిస్తారు. మిగిలిన రోజులు నిపుణుల బృందం సమక్షంలో ప్రతి విద్యార్థి అయిదు కిలోమీటర్ల చొప్పున డ్రైవింగ్‌లో నైపుణ్యం సాధిస్తారు. లైట్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు మాత్రమే ఈ శిక్షణకు అర్హులు. ప్రమాదాలు జరగకుండా శాస్త్రీయ పద్దతిలో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ కోర్సు ద్వారా ఉద్యోగంలో స్థిరపడగలుగుతామని, లేదంటే స్వయం ఉపాధి అయినా పొందగలమని విద్యార్థులు తెలిపారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సింహాద్రి ఎన్టీపీసీ నిర్ణయించింది. ఏడాది క్రితం గాజువాక ఐటీఐతో ఒప్పందం చేసుకొని విద్యార్థులకు శిక్షణనిస్తోంది. ప్రతి బ్యాచ్‌కు 20 మంది చొప్పున ఇప్పటికే 60 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పొందేవారికి రెండు నెలల ఉచిత బస్‌పాస్‌, ఖాకీ చొక్కా, ధ్రువపత్రం అందజేస్తారు. శిక్షణ ప్రారంభానికి ముందు ఎల్ఎల్‌ఆర్, ముగిసిన తర్వాత పూర్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇస్తారు. డ్రైవింగ్‌తో పాటు వాహన నిర్వహణ కూడా నేర్పుతామని శిక్షకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎన్‌టీపీసీ అధికారులు తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని