చింతలేని ఆరోగ్యానికి.. చిరు ధాన్యాలు

ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరు ధాన్యాలకు ఇప్పుడు మళ్లీ మహర్ధశ మొదలైంది. ఆధునిక జీవనంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ యుగంలో సైతం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న తపనతో మనలో చాలా మంది చిరు ధాన్యాలవైపే మొగ్గు చూపుతున్నారు.

Published : 14 Feb 2020 00:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరు ధాన్యాలకు ఇప్పుడు మళ్లీ మహర్ధశ మొదలైంది. ఆధునిక జీవనంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ యుగంలో సైతం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న తపనతో మనలో చాలా మంది చిరు ధాన్యాలవైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని పూటలా చిరు ధాన్యాల్ని ఆస్వాదిస్తున్నారు. హైబీపీ, షుగర్‌, గుండె జబ్బులు, అధిక బరువు, స్థూలకాయం వంటి వ్యాధుల దాడిని తట్టుకొని, వాటి నుంచి బయట పడేందుకు మళ్లీ మన పాత తరం ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపడమే పరిష్కారమని, చిరుధాన్యాలే ఆరోగ్యానికి శ్రేష్ఠమని నిపుణులు సూచిస్తున్నారు.  

చిరు ధాన్యాలతో కలిగే ప్రయోజనాలు..

చిరు ధాన్యాలు చిన్నగా ఉన్నాయని చిన్న చూపు చూడకూడదు. రాగులు, సజ్జలు, కొర్రలు లాంటి గింజలు గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు మాత్రం అనంతం. నేడు చిరు ధాన్యాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నవి జొన్నలు, రాగులు. కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కూడా వాడుతున్నారు. కానీ, కొర్రలు, అరికెలు, వరిగెలు, సాములు ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. కొందరైతే వీటిని చూసి కూడా ఉండరు. చిరు ధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, క్యాల్షియం, జింకు వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. చిరు ధాన్యాల్లో పొట్టు తీసినా, కాస్త కొవ్వు ఉంటుంది. పైగా ఇది మంచి కొవ్వు. దీంతో శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చిరు ధాన్యాలు షుగర్‌ పేషంట్లకు ఒక బలం లాంటివి. చిరు ధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి వీటిలోని గ్లూకోజ్‌ కూడా రక్తంలో కలుస్తుంది. చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను నములుతూ తినడానికి కాస్త ఎక్కువ సమయం పట్టడమే కాకుండా తీసుకునే ఆహార పరిమాణం సైతం తగ్గుతుంది. ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా ఆకలి వేయదు. ఇలా ఇవి బరువు తగ్గటానికి తోడ్పడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం అదుపులో ఉంటుంది. చిరుధాన్యాలు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గటానికి ఉపయోగపడతాయి. దీంతో కడుపులో ఇబ్బంది, అల్సర్ల వంటివి తలెత్తకుండా ఉంటుంది. వీటితో కాల్షియం, ఇనుము లభించడంతో పాటు శరీరంలో మలబద్ధకం దూరమవుతుంది. ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని