జగన్‌ షరతులను తిరస్కరిస్తున్నారు: సీబీఐ

అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే తన రాజకీయ, ధన, కండ బలంతో సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది. సీఎంగా పాలన విషయంలో ఆయనకు....

Updated : 14 Feb 2020 10:21 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే తన రాజకీయ, ధన, కండ బలంతో సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది. సీఎంగా పాలన విషయంలో ఆయనకు బాధ్యత ఉందనడంలో సందేహం లేదని.. అయితే ఆ కారణంతో కోర్టుకు శాశ్వతంగా హాజరు కాలేనని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో సీబీఐ అధికారులు బుధవారం కౌంటర్‌ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అనేక అంశాలను పొందుపరిచారు. తనపై తీవ్రమైన ఆరోపణలున్నాయని స్పష్టంగా తెలిసినప్పటికీ.. జగన్ బెయిల్ షరతులను తిరస్కరిస్తున్నారని సీబీఐ ఆక్షేపించింది. హాజరు మినహాయింపు పొంది బెయిల్ ఇచ్చిన కోర్టులో విచారణకు దూరం ఉండవచ్చా?అని కౌంటర్‌లో ప్రశ్నించింది. చిన్నపాటి కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వొచ్చని.. తీవ్రమైన కేసుల్లో కాదంటూ గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని కౌంటర్‌లో సీబీఐ ప్రస్తావించింది. 

జగన్‌ది హైప్రొఫైల్‌ కేసు..

జగన్ సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కాదని.. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారని సీబీఐ పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు చాలా అరుదుగా ఇవ్వాలని.. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. అవసరమైనప్పుడు సీఆర్ పీసీ 317 ప్రకారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే అవకాశం ఉందని తెలిపింది. జగన్ కేసు చాలా సున్నితమైన హైప్రొఫైల్ కేసుగా కౌంటర్‌ సీబీఐ అభివర్ణించింది. హాజరు మినహాయింపు నిందితుల హక్కు కాదని.. కోర్టు విచక్షణేనని స్పష్టం చేసింది. ప్రజా విధుల్లో ఉన్నంత మాత్రాన హాజరు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని సీబీఐ పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని.. జగన్‌ అభ్యర్థన విచారణార్హం కాదని న్యాయస్థానానికి తెలిపింది. ఆయన అభ్యర్థనను కొట్టివేయాలని కోరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని