వైద్యురాలిగా మెప్పించి.. పవర్‌లిఫ్టింగ్‌లో గెలిచి

పవర్‌ లిఫ్టింగ్‌.. భారత్‌లో ఇప్పటికీ పురుషులదే హవా. గాయాల బెడద, నాణ్యమైన శిక్షణలేమి, కుటుంబపరమైన ఆంక్షల కారణంగా యువతులు ఈ క్రీడకు దూరంగా....

Published : 21 Feb 2020 00:31 IST

ఐదు బంగారు పతకాలు కైవసం

చెన్నై: పవర్‌ లిఫ్టింగ్‌.. భారత్‌లో ఇప్పటికీ పురుషులదే హవా. గాయాల బెడద, నాణ్యమైన శిక్షణలేమి, కుటుంబపరమైన ఆంక్షల కారణంగా యువతులు ఈ క్రీడకు దూరంగా ఉంటున్నారు. ఆసక్తితో అలాంటివన్నీ అధిగమించి బరువులు ఎత్తేందుకు ముందుకొస్తే ఆమెకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటికీ ప్రతిభతో సమాధానం చెబుతూ దేశంలోనే ఉత్తమ పవర్‌ లిఫ్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తమిళనాడుకు చెందిన డాక్టర్‌ ఆర్తి అరుణ్.

తమిళనాడు వేలూరు సమీపంలోని ఆర్కాట్‌లో పుట్టి పెరిగిన ఆర్తి అరుణ్.. పాఠశాల, కళాశాల విద్య పూర్తిగా హైదరాబాద్‌లోనే సాగింది. నాన్న విజయ్‌కుమార్‌ వైద్యుడు. పాఠశాల దశలో బ్యాడ్మింటన్‌ ఆడేది. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. సంప్రదాయ కుటుంబ నేపథ్యం వల్ల పొట్టి దుస్తులు వేసుకోవాల్సి రావడంతో ఆ తరువాత క్రీడలకు దూరమైంది. 18 ఏళ్లకే చెన్నైకి చెందిన వైద్యుడితో వివాహం, ఇద్దరు పిల్లలు అన్ని అలా చూస్తుండగానే జరిగిపోయాయి. కుమార్తె పుట్టాక బరువు పెరగడంతో జిమ్‌కు వెళ్లడం మొదలు పెట్టింది. అక్కడే బరువులు ఎత్తడం ప్రారంభించింది. అప్పటి వరకు పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడ గురించి తెలియకపోయినా క్రీడల్లో రాణించాలనుకుంది. శిక్షణ తీసుకొని క్రీడలవైపు దృష్టి సారించింది. 

గృహిణి, దంత వైద్యురాలిగా బాధ్యతలు చూసుకుంటూనే.. ఆర్తి 70 కేజీల విభాగంలో బరిలో నిలిచింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించింది. హాంకాంగ్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు అర్హత సాధించి పతకంతో మెరిసింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 72 కేజీల విభాగంలో తమిళనాడుకి ప్రాతినిథ్యం వహించింది. ఆసియా స్థాయిలో పవర్‌ లిఫ్టింగ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. 2019లో తిరుగులేని విజయాలతో పవర్‌లిఫ్టింగ్‌లో సంచలనంగా మారింది. కామన్వెల్త్‌ క్రీడల్లో ఐదు పతకాలతో క్రీడా లోకాన్ని తనవైపు తిప్పుకుంది. పవర్‌లిఫ్టింగ్‌ని ఎంచుకున్నప్పుడు ఎవరూ ఆమెపై పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. తను మాత్రం పట్టు వదలక ప్రయత్నించి అనుకున్నది సాధించింది. పెళ్లై, పిల్లలు కూడా ఉన్న మహిళకు పవర్‌ లిఫ్టింగ్‌ ఏమిటని ఎగతాళి చేసిన వారి మాటలు సవాలుగా తీసుకున్న ఆర్తి.. అరుదైన అంతర్జాతీయ విజయాలతో అభినందనలు అందుకుంది. తలచుకుంటే అతివలు ఏదైనా సాధించగలరని నిరూపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని