చూపు లేకపోతేనేం.. నాన్న ఉన్నాడుగా

ఆ చిన్నారికి ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం. తన ఫేవరెట్‌ జట్టు మైదానంలో ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఆశ. కానీ దురదృష్టవశాత్తూ పుట్టుకతోనే అంధుడైన ఆ బాలుడు స్టేడియంలోనే కాదు

Published : 22 Feb 2020 00:27 IST

హృదయాన్ని కదిలిస్తున్న తండ్రీకొడుకుల వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆ చిన్నారికి ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం. తన ఫేవరెట్‌ జట్టు మైదానంలో ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఆశ. కానీ దురదృష్టవశాత్తూ పుట్టుకతోనే అంధుడైన ఆ బాలుడు స్టేడియంలోనే కాదు.. టీవీ ముందు కూర్చుని కూడా మ్యాచ్‌ను వీక్షించలేడు. అయినా సరే తన కుమారుడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్నాడా తండ్రి. చూపులేని కొడుకును స్టేడియంకు తీసుకెళ్లి.. మ్యాచ్‌ ఆద్యంతం ఎలా సాగుతుందో వివరించాడు. హృదయాలను హత్తుకునే ఈ ఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. 

సెబాస్టియన్‌ అనే చిన్నారి పుట్టుకతోనే అంధుడు. కానీ అతడికి ఫుట్‌బాల్‌ ఆటంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్‌ జట్టు గేమ్‌ ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని ఆశపడ్డాడు. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న సెబాస్టియన్‌ తండ్రి.. బారాన్‌క్విల్లాలోని ఎస్టాడియో మెట్రోపొలిటనో రాబర్టో మెలెండెజ్‌ మైదానంలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు ప్రతిక్షణం మైదానంలో ప్లేయర్లు ఎలా ఆడుతున్నారో కొడుకుకు వివరించి చెప్పాడు.   

ఈ వీడియోను అట్లెంటికో జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టు అభిమానులు.. జూనియర్‌ ఎస్‌ మి ఫ్యాషన్‌ అనే ఫ్యాన్‌ క్లబ్‌  ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొడుకు కోసం తండ్రి పడుతున్న తపనను చూసి నెటిజన్ల కళ్లు చెమర్చుతున్నాయి. ఆయన ఎంతో గొప్ప తండ్రి అంటు పలువురు భావోద్వేగ సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని