ఎవరికీ లంచం ఇవ్వకండి: కేటీఆర్‌

మున్సిపాలిటీపై ప్రజల్లో ఉన్న అపవాదులు తొలగించి.. లంచం లేని, సమస్యల్లేని సకల వసతులున్న పచ్చని పట్టణాలుగా ప్రతి మున్సిపాలిటీని తీర్చిదిద్దడమే ‘పట్టణ ప్రగతి’ లక్ష్యమని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 25 Feb 2020 00:45 IST

మహబూబ్‌నగర్‌: మున్సిపాలిటీపై ప్రజల్లో ఉన్న అపవాదులు తొలగించి.. లంచం లేని, సమస్యల్లేని సకల వసతులున్న పచ్చని పట్టణాలుగా ప్రతి మున్సిపాలిటీని తీర్చిదిద్దడమే ‘పట్టణ ప్రగతి’ లక్ష్యమని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరికీ లంచం ఇవ్వొద్దని సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వైట్‌హౌస్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. తద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. హైదరాబాద్‌ తరహాలో పారిశుద్ధ్య కార్మికులను వార్డు ప్రజలకు పరిచయం చేయాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల ‘పట్టణ ప్రగతి’లో చేపట్టాల్సిన పనులు, కమిటీలు, కౌన్సిలర్ల బాధ్యతలు, అధికారుల విధినిర్వహణపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

సిరిసిల్లలో చేస్తున్నారు.. ఇక్కడా అలా చేయండి!

సిరిసిల్లలో తడి, పొడి చెత్తలను ప్రజలే వేరు చేసి ఇవ్వడం ద్వారా నెలకు రూ.3లక్షల ఆదాయం సమకూరుతోందని కేటీఆర్‌ వివరించారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలు పంపిణీ చేస్తే వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం సరికాదన్నారు. పాలమూరులోనూ తడి, పొడి చెత్తలను వేరు చేయాలని, అలా చేయని ఇళ్ల నుంచి భవిష్యత్తులో చెత్త సేకరించవద్దని సిబ్బందికి ఆదేశిస్తామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని వార్డు ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమం మంచి ఫలితం ఇచ్చిందని.. పాలమూరులోనూ అమలు చేయాలని అధికారులకు సూచించారు. వార్డులు, ఇళ్లు, ఖాళీస్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు సైతం పచ్చదనంతో మెరిసిపోవాలన్నారు. పట్టణ ప్రగతిలో నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదువు నేర్పడం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణను నిలపాలన్నారు.  కొత్త పురపాలక చట్టం ప్రకారం 75 గజాల స్థలంలో నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకుంటే మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదని గుర్తుచేశారు.

మంచినీళ్లొస్తున్నాయా?: పాదయాత్రలో కేటీఆర్‌

ఈ పర్యటన సందర్భంగా తొలుత ఆయన మెట్టుగడ్డ డైట్‌ కళాశాల మైదానంలో నిర్మించతలపెట్టిన సమగ్ర శాకాహార, మాంసాహార మార్కెట్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో షీ టాయిలెట్స్‌కు శంకుస్థాపన చేశారు. రైల్వే స్టేషన్‌ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌, బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌, ఇండోర్‌ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం పాత తోట మురికివాడలో పాదయాత్ర చేస్తూ అక్కడి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మంచినీళ్లు వస్తున్నాయా? రెండు పడక గదుల ఇళ్లు అందాయా? పారిశుద్ధ్యం బాగుందా? ఏమైనా సమస్యలున్నాయా?అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని హితవు పలికారు. భూగర్భ డ్రైనేజీ కావాలని కోరగా దశల వారీగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ రేపు కల్వకుర్తిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని