వరద సమయాల్లోనూ పనులు జరగాలి:జగన్‌

గోదావరికి వరదలు వచ్చే జూన్‌ నుంచి అక్టోబర్‌ నెలల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు పెండింగ్‌ .....

Published : 29 Feb 2020 00:24 IST

పోలవరం: గోదావరికి వరదలు వచ్చే జూన్‌ నుంచి అక్టోబర్‌ నెలల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు పెండింగ్‌ నిధులతో పాటు డిజైన్ల అనుమతుల కోసం దిల్లీలో ప్రత్యేకంగా అధికారులను నియమించాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2021 జూన్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తిచేయాలని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిలో ఒక సీజన్‌ నిర్మాణ కాలాన్ని కోల్పోయినందున దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. స్పిల్‌ వే పనులు పూర్తి చేసిన అనంతరం అప్రోచ్‌ ఛానల్‌ కూడా పూర్తి కావాలన్నారు. వచ్చే జూన్‌ నాటికి స్పిల్‌వే అందుబాటులోకి వస్తే వరద ప్రవాహం అటుగా మళ్లించేందుకు వీలుంటుందని.. ఆ తర్వాత రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు చేపట్టేందుకు అవకాశముంటుందని చెప్పారు. 

కాఫర్‌ డ్యాం పూర్తి చేసి స్పిల్‌ వే మీదుగా వరద ప్రవాహం మళ్లించినా ముంపు ప్రాంతాలు పెరుగుతాయని.. ఆ ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని తరలించే అంశాన్ని తక్షణమే చేపట్టాలని జగన్‌ ఆదేశించారు.  కుడి, ఎడమ కాలువలను గడువునాటికి పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు టన్నెల్‌ పనులు పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం చెప్పారు. ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరముందని.. దీనిపై కేంద్ర జలసంఘంతో సంప్రదింపులు జరిపేందుకు ఓ లైజనింగ్‌ అధికారిని దిల్లీలో ఉంచాలని జగన్‌ సూచించారు. స్పిల్‌వే ముందుభాగంలో నిర్మించాల్సిన వంతెనపైనా అధికారులతో సీఎం చర్చించారు. ఈ వంతెనను ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాంతో అనుసంధానించేలా డిజైన్‌ను ప్రతిపాదించారు. తద్వారా నాలుగు వరుసల రహదారి ఏర్పడుతుందని.. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని