3 పరోటాలు తింటే లక్ష రూపాయలు... 

ఇక్కడ రుచికరమైన పరోటాలే కాదు... పందెంలో గెలిస్తే లక్ష రూపాయల బహుమతిని కూడా ఇస్తారు. ఆ విశేషాలు...

Published : 02 Mar 2020 14:38 IST

రోహ్‌తక్‌: పరోటా అంటే ఇష్టమా? రెండు మూడు ప్లేట్లైనా ఈజీగా లాగించేస్తారా? అయితే మీరు కచ్చితంగా హరియాణాలోని తపస్య హోటల్‌కు వెళ్లాల్సిందే...అక్కడ రుచికరమైన పరోటాలే కాదు.. పందెంలో గెలిస్తే లక్ష రూపాయల బహుమతిని కూడా ఇస్తారు. ఆ విశేషాలు మీ కోసం..

ఇప్పటి వరకు ఇద్దరే...
హరియాణా రాష్ట్రం రోహ్‌తక్‌లోని ‘తపస్య హోటల్‌’ పెద్ద పరోటాలకు పెట్టింది పేరు. ఆ హోటల్‌లో రుచికరమైన పరోటాలను అందించటమే కాదు... వాటిని తినడంపై పందెం కూడా నిర్వహిస్తారు.  ‘జంబో పరోటాలు’ ఈ హోటల్‌ ప్రత్యేకత. వారు తయారుచేసిన మూడు జంబో పరోటాలను 50 నిముషాల్లో తింటే లక్ష రూపాయలు ఇస్తారు. అంతేకాదు... జీవితాంతం ఉచితంగా భోజనం అందిస్తామని హోటల్‌ యాజమాన్యం తెలిపింది. అయితే 2006లో ఈ పందెం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరంటే ఇద్దరే ఈ పందెంలో నెగ్గారని... హోటల్‌ యజమాని చెప్పారు. 

జంబో పరోటా... లెక్కేంటీ?
ఈ హోటల్‌లో 50 రకాల పరోటాలు మూడు రకాల సైజుల్లో తయారు చేస్తారు. వాటిలో బంగాళదుంప, కాలీఫ్లవర్‌, ఉల్లిపాయ, ఆలూ మిక్స్‌ పరోటాలున్నాయి. జంబో సైజు పరోటా ఒక్కోటి రెండున్నర అడుగుల మేర ఉంటుంది. దానిని నెయ్యితో తయారుచేస్తారు. ఇక ఆ పరోటాలో రెండు కిలోల కుర్మా కూడా వేస్తారు. ఈ జంబో పరోటా ఒక్క దాన్ని ఐదుగురు తినచ్చు. మీడియం పరోటా ధర రూ.90, జంబో పరోటాలు రూ.300 ఆపైన ఉంటాయి. వీటిని తినేందుకు చాలా దూరం నుంచి కూడా భోజన ప్రియులు ఇక్కడికి వస్తుంటారు. నెయ్యితో తయారు చేసిన ఇక్కడి పరోటాలను తిని ఆహా ఏమి రుచి అనకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని