ముంచుకొస్తున్న మరో ప్రమాదం..

రన్నింగ్‌ మ్యాన్‌.. బర్డ్‌ బాక్స్‌.. బ్లూవేల్‌ ఛాలెంజ్‌.. ఇప్పుడదే తరహాలో మరో ప్రమాదకరమైన ఆట సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. తలలు పగులగొట్టుకునే ‘స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌/ట్రిప్పింగ్‌ జంపింగ్‌’ వైరల్‌గా మారింది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్‌ దేశాల్లో

Updated : 22 Feb 2024 14:59 IST

బ్లూవేల్‌ తరహాలో ‘స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌’
ఆ మోజులో తలలు పగులగొట్టుకుంటున్న యువత
ఈనాడు, హైదరాబాద్‌

రన్నింగ్‌ మ్యాన్‌.. బర్డ్‌ బాక్స్‌.. బ్లూవేల్‌ ఛాలెంజ్‌.. ఇప్పుడదే తరహాలో మరో ప్రమాదకరమైన ఆట సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. తలలు పగులగొట్టుకునే ‘స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌/ట్రిప్పింగ్‌ జంపింగ్‌’ వైరల్‌గా మారింది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్‌ దేశాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఆటకు ఇప్పుడిప్పుడే మన దేశంలోని యువత, ముఖ్యంగా చిన్నారులు ఆకర్షితులవుతున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు వరుసగా నిల్చోని..
నిత్యం ఏదో ఒక ఛాలెంజ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంది. కొన్ని మంచి చేస్తుంటే.. మరికొన్నేమో ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రన్నింగ్‌ కారు నుంచి దిగి.. నెమ్మదిగా కదులుతున్న ఆ కారు పక్కనే డ్యాన్స్‌ చేసి మళ్లీ కారెక్కేదే ‘రన్నింగ్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ పనులు చేసేది ‘బర్డ్‌ బాక్స్‌’ ఛాలెంజ్‌. అమెరికా ఉఠా రాష్ట్రంలో ఒకమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని కారును నడిపి గోడను ఢీకొట్టింది. అమ్మాయి తలకు తీవ్ర గాయాలు కాగా కారు దెబ్బంతింది. బ్లూవేల్‌ ఆట ఇంటర్‌నెట్‌ను కుదిపేసింది. చేతిమీద తిమింగలం బొమ్మ గీయించుకుని ఆడే ఈ ఆట చివరకు ఆటగాడి మరణంతో ముగుస్తుంది. తాజాగా వైరల్‌గా మారిన ‘స్కల్‌ బ్రేక్‌ ఛాలెంజ్‌’లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. మధ్యలో వ్యక్తి గాల్లోకి ఎగిరినప్పుడు చెరోవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి కాళ్లను కొడతారు. వాళ్ల దెబ్బల నుంచి తప్పించుకుంటే గెలిచినట్లు. అనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి ఇతరులకు సవాలు విసురుతున్నారు.

 

ప్రాణాలతో చెలగాటమే..
ఈ ఛాలెంజ్‌లో స్టంట్లు చేయడమంటే ప్రాణాలపైకి తెచ్చుకోవడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘స్కల్‌ బ్రేక్‌’ ఛాలెంజ్‌ తీసుకుని వెనక్కి పడితే ఇతర శరీర భాగాలతో పాటు తలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు లేదా జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. కొన్ని యాప్స్‌లో ఈ ఆటను జోడించడం వల్ల మరింత వైరల్‌గా మారింది.


కఠిన చర్యలు తప్పవు
- వీసీ సజ్జనార్‌,  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

స్కల్‌ బ్రేక్‌ ఛాలెంజ్‌ను స్వీకరించినా.. వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఊపేక్షించే ప్రసక్తి లేదు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. ఎవరైనా వీడియోలు చేస్తూ కనిపిస్తే 100 లేదా సైబరాబాద్‌ పోలీసుల వాట్సాప్‌ నంబర్‌ 94906 17444కు ఫిర్యాదు చేయవచ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని