తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తెలంగాణలో ఇంటర్‌ మొదటి, ద్వితీయ

Updated : 04 Mar 2020 09:31 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తెలంగాణలో ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.65లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో4.8 లక్షల మంది  మొదటి సంవత్సరం పరీక్షలకు, 4.85లక్షల మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. లొకేటర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

కేటీఆర్‌ అభినందనలు
ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ‘‘విజయాలు సాధించండి..ఒత్తిడికి లోనుకాకండి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు జరగనుండగా.. 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. నిమిషం ఆలస్యమైతే అనుమతి నిరాకరణ అనే నిబంధనను సడలించినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చినా స్థానిక పరిస్ధితుల మేరకు అనుమతిస్తామని, ఎక్కువ ఆలస్యానికి ప్రత్యేక పరిస్థితులు, కారణాలు ఉంటే అనుమతించే అంశంపై పరీక్షా కేంద్రాల ముఖ్యపర్యవేక్షకులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలకు 5,46,368, రెండో సంవత్సరం పరీక్షలకు 5,18,788 విద్యార్థులు హాజరుకానున్నారు.

విద్యార్థులకు చంద్రబాబు అభినందనలు
ఇంటర్‌ విద్యార్థులకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ‘‘భయాలన్నీ వీడి పరీక్షలు బాగారాయాలి. విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ట్విటర్‌లో పోస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని