రాష్ట్రపతికి నిర్భయ తల్లి కృతజ్ఞతలు

నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన పవన్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి రాష్ట్రపతికి కృతజ్ఞతలు చెప్పారు.

Published : 05 Mar 2020 00:37 IST

దిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన పవన్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించిన నేపథ్యంలో బాధితురాలి తల్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్భయ అత్యాచారం, హత్య కేసుల్లో నలుగురు దోషులకు మార్చి 3న ఉరిశిక్ష పడాల్సి ఉండగా.. పవన్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడంతో ఉరి అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పవన్‌ అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం తిరస్కరించారు. 

ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ‘దోషి పవన్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించినందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గారికి కృతజ్ఞతలు. ఈసారైనా దోషులను సరైన సమయానికి ఉరి తీస్తారని భావిస్తున్నా. దోషులకు శిక్షపడే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. దోషులు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని బయపడాలని ప్రయత్నించినా కుదరలేదు. అది నాకు సంతోషం కలిగించే విషయం. ఈసారి వచ్చే డెత్‌వారెంట్‌ చివరిది అవుతుందని అనుకుంటున్నా. ఇప్పటి వరకూ కోర్టులో వాదనలు వినడం.. వాయిదా పడటం చూశా. కానీ, శిక్షను వాయిదా వేయడం తొలిసారిగా చూస్తున్నా. ప్రపంచం మొత్తం దోషులను ఉరి తీయాలని కోరుకుంటోంది. మాలాంటి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దోషులకు ఉరిశిక్ష పడే వరకూ నేను పోరాడుతూనే ఉంటా’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని