చదువుల తల్లి మురిసిపోదా..!

తొంభై ఏళ్ల కింద చాలా మందిలాగే వాళ్ల జీవితంపైనా బాల్య వివాహమనే బరువు పడింది. బడిమెట్లయినా ఎక్కని చరిత్ర ఒకరిదైతే.. బాధ్యతలు చదువును దూరం చేసిన చరిత్ర మరొకరిది. 30

Updated : 05 Mar 2020 20:10 IST

తొంభై ఏళ్ల కింద చాలా మందిలాగే వాళ్ల జీవితంపైనా బాల్య వివాహమనే బరువు పడింది. బడిమెట్లయినా ఎక్కని చరిత్ర ఒకరిదైతే.. బాధ్యతలు చదువును దూరం చేసిన చరిత్ర మరొకరిది. 30 ఏళ్లలోపే భర్త మరణం.. అరడజనుకు పైగా సంతానంతో పాటు తోబుట్టువులు, అత్తామామ, ఆడబిడ్డలు ఇలా.. అందర్నీ పోషించాలంటే రెండు చేతులను నాలుగు చేసి పనిచేయాల్సిన పరిస్థితి. వీటికి తోడు రోగాలు, నొప్పులు. కడుపు కట్టుకొని పిల్లలను పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి పెళ్లిళ్లు చేశారు. అక్కడితో అయిపోతుందా.. కొమ్మలు ఎంత పెద్దవైనా చెట్టే కదా మోయాల్సింది. అలా.. వాళ్ల పిల్లలకు, పిల్లల పిల్లలకూ శుభకార్యాలు, కానుకలు. ఇలా సర్వస్వం సమర్పించుకున్నారు. మన కోసం కాలం ఆగదు కదా.. వయసు మీద పడింది. ఒకరు శతాధిక్యత సాధిస్తే.. మరొకరు వందేళ్లకు అతి చేరువయ్యారు. ఈ క్రమంలో వాళ్లేం చేశారు..?

లేటు వయసులోనూ చదువుకోసం తపనపడ్డారు. ‘సాధించాలన్న తపన ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు.. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే చిన్న రాయినైనా ఎత్తలేం’ అని నిరూపిస్తున్నారిప్పుడు. వయసనే సంఖ్యను పక్కకు నెట్టి చదువుకోసం బయలుదేరి దేశం మొత్తం వారెవ్వా.. ముసలవ్వ అనేలా చేశారు. నిరక్షరాస్యతను రూపుమాపాలన్న లక్ష్యంతో కేరళ నిర్వహిస్తున్న ‘అక్షర లక్ష్యం’ ప్రాజెక్ట్‌లో చేరి సత్తాచాటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందజేసే నారీ శక్తి పురస్కారం అందుకోనున్నారు. వాళ్లే.. 98ఏళ్ల కార్తియాని అమ్మ, 105 ఏళ్ల భగీరథి అమ్మ. ఈ అమ్మల గతమేంటో చూద్దాం..

మనవళ్లను చూసి చదువుకోవాలనిపించి..

కేరళలోని అలప్పుళ జిల్లాకి చెందిన కార్తియాని అమ్మ 98ఏళ్ల వయసులో ఈ ప్రోగ్రామ్‌లో చేరారు. చేరికతోనే ఆమె రికార్డు సృష్టించారు. ఈ కోర్సులో చేరిన అతిపెద్ద వయస్కురాలు ఆమె. అక్కడ నామ్‌ కే వాస్తేలా కాకుండా.. టాపర్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షను 42,933 మంది రాశారు. కాగా.. చదివే పరీక్షలో 30మార్కులకు 30, రాత పరీక్షలో 40మార్కులకు 40, గణితంలో 30 మార్కులకు 28 సాధించిన కార్తియాని అమ్మ టాపర్‌గా నిలిచారు. లేటు వయసులోనూ పోటీ పడి చదివి టాపర్‌గా నిలిచిన కార్తియాని అమ్మకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ‘నిత్యవిద్యార్థి’గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆమెకు సర్టిఫికెట్ ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తియాని అమ్మ ఈ ఘనత సాధించడానికి గల కారణాలు వెల్లడించారు. తన ఇంట్లో మనవలు, మనవరాళ్లు చదువుకుంటుంటే చూసి చదువుకోవాలని కోరిక కలిగిందని చెప్పుకొచ్చారు. తాను పరీక్షల్లో ఇతరులను చూసి కాపీ కొట్టలేదని, ఇతరులకే తాను రాసింది చూపించానని చెప్పుకొచ్చారు. అక్కడితో చదువు ఆపేయకుండా కంప్యూటర్‌ నేర్చుకోవాలని ఉందని, తాను యుక్త వయసులో ఉండి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించేదాన్నని మనసులోని మాట బయటపెట్టారు. 

వందేళ్ల తర్వాత 4వ తరగతి

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ 105ఏళ్ల వయసులో 4వ తరగతి పూర్తి చేశారు భగీరథి అమ్మ. మూడో తరగతి చదువుతున్నప్పుడు తల్లి మరణం. కుటుంబ బాధ్యతలు చదువును దూరం చేశాయి. జీవితం దాదాపు ముగిసిపోతున్న క్రమంలో చదువుకోవాలన్న తన కోరికకు మళ్లీ నీళ్లు పోశారు. కేరళ రాష్ట్రం చేపట్టిన విద్య మిషన్‌లో భాగంగా ఆమె 2019 నవంబర్‌లో 4వ తరగతిలో చేరారు. దీనికి 70ఏళ్ల తన కూతురు సహకరించడం విశేషం. ఆమె ఈ పరీక్షలో 275 మార్కులకు 205 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. దీంతో అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ పి.ఎస్.శ్రీకళ ఇంటికి వెళ్లి మరీ భగీరథి అమ్మను అభినందించారు. భగీరథి అమ్మకు ఆరుగురు పిల్లలు, 15 మంది మనవరాళ్లు ఉన్నారు. ఇలా ఆమె దాదాపు వందేళ్ల తర్వాత తిరిగి విద్యను ప్రారంభించి అందరికీ ఆదర్శంగా మారారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఆదర్శ మహిళలను నారీ శక్తి పేరుతో సత్కరిస్తుంటుంది. శతాధిక వయసులోనూ విద్యపై ఆసక్తి చూపించి విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచిన కార్తియాని అమ్మ, భగీరథి అమ్మను ఈసారి నారీ శక్తి పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని