కేసీఆర్‌తో తమిళనాడు మంత్రులు భేటీ

తాగునీటి అవసరాల కోసం తమిళనాడుకు నీరిచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు. తమిళనాడు మంత్రులు వేలుమణి, జయకుమార్‌తో పాటు అధికారుల బృందం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమైంది. చెన్నైలో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని...

Updated : 05 Mar 2020 22:28 IST

​​​​​​

హైదరాబాద్‌: తాగునీటి అవసరాల కోసం తమిళనాడుకు నీరిచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు. తమిళనాడు మంత్రులు వేలుమణి, జయకుమార్‌తో పాటు అధికారుల బృందం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమైంది. చెన్నైలో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నీరు విడుదలకు చొరవ తీసుకోవాలని కోరింది. తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఫోన్‌లో ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ సంప్రదింపులు జరిపారు. ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడుకు తాగునీరిచ్చి సహకరిద్దామని.. నీరు ఎక్కడి నుంచి ఇవ్వొచ్చనే విషయాలపై ఇరువురూ చర్చించారు. పొరుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల విషయంలో సానుభూతి, సహనశీలతతో వ్యవహరించాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

నీరు ఇవ్వాలని కోరుతూ తనతో పాటు ఏపీ సీఎంకు అధికారిక ప్రతిపాదన పంపాలని తమిళనాడు మంత్రులకు కేసీఆర్‌ సూచించారు. తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావించానని..లోక్‌సభలోనూ తెరాస ఎంపీలు చెన్నై తాగునీటి అంశాన్ని లేవనెత్తినట్లు ఆయన గుర్తు చేశారు. భారతీయుడిగా, పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తమిళనాడుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ తమిళనాడు మంత్రులకు హామీ ఇచ్చారు. ప్రతిపాదన అందాక మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణులు సమావేశమై నీటి సరఫరా కోసం నివేదిక సిద్ధం చేయాలని.. ఏకాభిప్రాయంతో తుదినిర్ణయానికి రావాలని కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రాలు పరస్పరం ఎలా సహకరించుకోగలవో ఈ పరిణామం ద్వారా దేశానికి తెలపాలని, ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. తాగునీటి అంశంపై తమిళనాడు మంత్రులు ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని