మొసలి అనుకుంటే పొరబడినట్లే..!

ఈ చిత్రాన్ని చూశారా... ఏముంది మొసలి పిల్లే కదా అని అనుకుంటున్నారా? అక్కడే మీరు తప్పులో కాలేశారు.

Published : 07 Mar 2020 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ చిత్రాన్ని చూశారా.. మొసలి పిల్ల అనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే. ఇది ఓ చేప. అమెరికాలో పెన్సిల్వేనియా ఫెనిమోర్‌ పార్క్‌లో ఉన్న ఓ కొలనులో ఇది దొరికింది.పొడవాటి నోరు, రంపాల్లాంటి పళ్లతో ఉన్న ఈ చేప జంతు ప్రపంచాన్ని గడగడలాడించే మొసలిని పోలి ఉండటం విశేషం. అరుదైన ఈ చేప పేరు ‘యాలిగేటర్‌ గార్‌’ అంటారట. ఇది సాధారణంగా గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో ఎక్కువగా ఉంటుంది.

పార్కులోని కొలనులో ఈ చేప ఉన్నట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. అయితే అధికారులు అక్కడికి చేరుకునే లోగానే ఆ చేప చనిపోయింది. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవటంతో...అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేని ఈ చేప చనిపోయిందని అధికారులు వివరించారు. దానిని ఎవరో అక్కడ వదిలి వెళ్లి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. ఇటువంటి అరుదైన జీవజాలాన్ని పెంచలేని వారు తమకు సమాచారం అందిస్తే... వాటి బాధ్యతను తాము స్వీకరిస్తామని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం దాని శరీరాన్ని విద్యా సంబంధ పరిశోధనల నిమిత్తం జాగ్రత్త చేశారు. ఇక ఆ ప్రాంతంలోని పోలీసు అధికారులు ఈ మొసలి-చేప చిత్రాన్ని అంతర్జాలంలో షేర్‌చేశారు. డైనోసార్ల కాలం నాటి చేప అంటూ నెట్టింట్లో దీని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని