కంటతడి పెట్టిస్తున్న ‘కరోనా’ చిత్రం!

కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తోంది చైనా. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే విషాద చాయాలు అలుముకున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్‌ను అడ్డుకునే మార్గం దొరక్క వైద్యులు, శాస్త్రవేత్తలు తలలుపట్టుకుంటున్నారు.

Updated : 08 Mar 2020 21:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తోంది చైనా. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే విషాద ఛాయలు అలముకున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్‌ను అడ్డుకునే మార్గం దొరక్క వైద్యులు, శాస్త్రవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆర్థికంగానూ దెబ్బతింటోంది. ఇప్పటికే దాదాపు 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 80వేలకు పైగా వైరస్‌ సోకి మంచంపట్టారు. ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తిరిగి వస్తారో రారో తెలియక చైనీయుల గుండెలు బరువెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఒక కరోనా బాధితుడి చిత్రం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
ఆసుపత్రిలో కరోనా బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కనీసం జెల్లో ఖైదీలకైనా అప్పుడప్పుడు బయటి ప్రపంచాన్ని చూపిస్తారు. తనవాళ్లతో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. కానీ, కరోనా బాధితుల పరిస్థితి మాత్రం దయనీయం. ఎవర్నీ చూడనివ్వరు. ఎవరితో మాట్లాడనివ్వరు. వాళ్లు ఆసుపత్రి నుంచి బయటికి రావాలంటే రెండే మార్గాలు. ఒకటి వైరస్‌ నుంచి కోలుకోవాలి. లేదంటే ప్రాణాలైనా విడిచిపెట్టాలి. 

కరోనా ప్రభావం ఎక్కువగా వుహాన్‌లో 87 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఇక బయటికి వెళతానన్న నమ్మకం కోల్పోయిన ఆ వృద్ధుడు తన పర్యవేక్షణ చూసుకునే వైద్యుడిని ఒక కోరిక కోరాడు. ఒక్కసారి సూర్యాస్తమయాన్ని చూడాలని ఉందని, ఎలాగైనా తనకు చూపించాలని వేడుకున్నాడు. వృద్ధుడి కోరిక కాదనలేకపోయిన ఆ వైద్యుడు మంచంతో సహా వృద్ధుడిని బయటికి తీసుకెళ్లాడు. భవనాల మధ్యలో నుంచి అస్తమిస్తున్న సూర్యుడిని ఆ వృద్ధుడికి చూపించాడు. సూర్యాస్తమయాన్ని చూసిన ఆ వృద్ధుడు మురిసిపోయాడు. దీనికి సంబంధించిన చిత్రం ఓ వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశాడు. ఈ దృశ్యాన్ని చూసి చాలా మంది నెటిజన్లు.. ‘ఇది గుండెలు పిండేస్తున్న దృశ్యం. వైద్యులు నిజంగా మన హీరోలు’ అని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని