Published : 08/03/2020 01:09 IST

ప్రతిభ చేతుల్లో కాదు.. చేతల్లో ఉంది

వడోదర (గుజరాత్‌): రెండేళ్ల క్రితం. అది పదో తరగతి పరీక్షా హాలు. అందరూ ప్రశ్నపత్రం తీసుకునే హడావుడిలో ఉన్నారు. ఓ విద్యార్థి తరగతి గదిలోకి కష్టంగా నడుస్తూ అడుగుపెట్టాడు. ఒక్కసారిగా అందరి చూపూ అతని వైపు. కారణం, అతడికి రెండు చేతులూ లేవు. ఒక కాలుకీ వైకల్యం. ఒక్క నిమిషం అంతా అయ్యో అనుకున్నారు. మరునిమిషం, ఇతడెలా పరీక్ష రాస్తాడని ఆశ్చర్యంగా చూశారు. కానీ ప్రశ్నపత్రం అందుకున్న అతడు జవాబులు రాయడం మొదలుపెట్టాడు. చేతుల్లేవ్‌ కానీ అతని ముఖంలో అపరిమితమైన ఆత్మవిశ్వాసం. నిజానికి, అటువంటి వైకల్యం ఉన్నవారికి పరీక్ష రాయడంలో సాయం అందించేందుకు స్క్రయిబ్‌ని ఇస్తారు. కానీ, ఆ అవకాశాన్ని అతడు కాదనుకున్నాడని, వేగంగా రాసే మోచేయి చెప్పకనే చెబుతోంది. హాలులోని వారంతా పరీక్ష రాస్తున్నప్పటికీ వాళ్ల చూపంతా అతనిపైనే. వారికి తీసిపోని వేగంలో జవాబులు రాసిచ్చి, మంచి మార్కులు వస్తాయన్న ధీమాతో బయటికొచ్చాడు. వైకల్యం ఉంటేనేం, అది చదువుకేం అడ్డం కాదు.. అని నిరూపించిన అతడే వడోదరకు చెందిన శివమ్‌ సోలంకీ!

శివమ్‌ పుట్టుకతో వైకల్యం ఉన్న వాడు కాదు. అందరి పిల్లల్లా ఉత్సాహంగా ఉరుకుతూ, క్రికెట్‌ ఆడుతూ బాల్యానందాన్ని పొందిన వాడే. 13 ఏళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులు, ఒక కాలు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి దివ్యాంగుడిగా ఆ బాలుడు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు.  చేతులు లేనప్పటికీ చింతిస్తూ ఇంట్లోనే కూర్చోలేదు. ఎంతకష్టమైనా బడికెళ్లాలి, అందరిలా ఎదగాలి అని తపన పడ్డాడు. మోచేతితో రాయడం సాధన చేశాడు. ఆ క్రమంలో కొన్నిసార్లు చేతులు విపరీతంగా నొప్పి పెట్టేవి. పంటి బిగువున బాధను భరించి, రాయడం కొనసాగించే వాడు. ఆ కష్టం వృథా పోలేదు. పదో తరగతి పరీక్షల్లో 81 శాతం మార్కులొచ్చాయి. అందరూ శభాష్‌ అన్నారు. ఆ తరవాత కాలేజీలో చేరాడు. 12వ తరగతి  పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించేందుకు కష్టపడుతున్నాడు. ‘మోచేత్తో రాయడం చాలా కష్టం శివమ్‌’ అని ఎవరైనా అంటే ‘నేను చాలా బాగా రాస్తాను.  నేనే కాదు, మీరూ బాగా రాయాలి. అయినా ఇవి కేవలం పరీక్షలు మాత్రమే. ఇవి మన పూర్తి జీవితాన్ని నిర్ణయించలేవు. ఒత్తిడికి గురికాకుండా సాధన చేయండి. చక్కగా రాయండి’ అంటూ వారికి సలహా ఇస్తున్నాడు.

‘వైకల్యంతో బాధపడుతున్న నా కొడుకుకి స్కూల్‌ యాజమాన్యం ఎంతో సహకరించింది. ఏదైనా సాయం కావాలంటే ఉపాధ్యాయులు వెంటనే వచ్చి సందేహాలను నివృత్తి చేసేవారు’ అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు శివమ్‌ తండ్రి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని