ఆకలిలేని సమాజం కోసం...

వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలు సామాజిక సేవలోనూ దూసుకెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు......

Updated : 08 Mar 2020 14:52 IST

మోదీ మెచ్చిన మహిళల్లో ఒకరీమె..

చెన్నై: వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలు సామాజిక సేవలోనూ దూసుకెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్జీఓలు స్థాపించి ప్రజలకు చేరువవుతున్నారు. అలా పుట్టిందే ‘ఫుడ్‌బ్యాంక్-ఇండియా’. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో నేటికీ లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి దీనస్థితికి చలించిన స్నేహా మోహన్‌దాస్‌ ఈ ఎన్జీఓను స్థాపించారు. ఆకలిలేని సమాజ సృష్టి కోసం ముందుకు సాగుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ ఖాతాను నిర్వహించే అవకాశం దక్కించుకున్నారు. 

మన ఇంట్లో వండిందే...
కొంతమంది వలంటీర్లతో కలిసి స్నేహా మోహన్‌దాస్‌ చెన్నైలోని వీధుల్లో తిరుగుతారు. ఆశ్రయం లేక అనాథలైన ఎంతో మందిని పలకరిస్తారు. వారితో కాసేపు మాట్లాడి వారి బాగోగులు తెలుసుకుంటారు. అనంతరం భోజన ప్యాకెట్లను వారికి అందజేస్తున్నారు. ఈ ఆహారాన్ని వారు ఎక్కడి నుంచి సేకరిస్తారో తెలుసా? మనం ఇంట్లో వండుకునేటప్పుడు స్తోమతకు తగ్గట్లు ఎంతమందికి వీలైతే అంతమందికి ఎక్కువ వండితే చాలు. ఈ విషయాన్ని ఫుడ్‌బ్యాంక్‌-ఇండియాకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే వలంటీర్లు వచ్చి ఆహారాన్ని సేకరిస్తారు. దాన్ని ప్యాక్‌ చేసి అభాగ్యులకు అందజేస్తారు. దీనికోసం వారు సోషల్‌ మీడియాని సమర్థంగా వినియోగించుకుంటున్నారు. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ సహా మరికొన్ని ప్రముఖ నగరాల్లో ‘ఫుడ్‌బ్యాంక్‌-ఇండియా’ పనిచేస్తోంది.

అమ్మ నుంచే స్ఫూర్తి...

చెన్నైలో జన్మించిన స్నేహా మోహన్‌దాస్‌ అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశారు. అన్నమలై విశ్వవిద్యాలయం నుంచి సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవమూ ఉంది. తన తల్లి నుంచే స్నేహ స్ఫూర్తి పొందారు. ఎంతోమంది నిరాశ్రయులకు ఆమె ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు. ఇలాంటి వారు ఎంతో మంది ఉంటారని గుర్తించిన స్నేహ వారి కోసం ఏదో చేయాలని సంకల్పించారు. ఆ ఆశయం నుంచి పుట్టిందే ఫుడ్‌బ్యాంక్‌-ఇండియా.

నాకు నచ్చింది చేయడంలోనే నేను స్ఫూర్తి పొందుతాను. మోదీ ఖాతా ద్వారా నేను ఈరోజు అందరిలో స్ఫూర్తి నింపాలనుకుంటున్నాను. మాస్‌ కుకింగ్‌, కుకింగ్‌ మారథాన్స్‌, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాల్ని చేపడుతున్నాం. మాతో అందరూ చేతులు కలపాలని కోరుతున్నాం. ప్రతిఒక్కరు కనీసం ఒక్కరికైనా సాయం చేయండి. ఆకలి లేని సమాజ నిర్మాణంలో భాగంకండి.  -స్నేహా మోహన్‌దాస్‌, నరేంద్ర మోదీ ట్విటర్‌ ఖాతాలో                                                                                                                                                            

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని