భార్య చెంతకు పెనిమిటీ

ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ గణేశ్‌నగర్‌లో గంగాధర్‌, భార్య బేబీలు నివాసం ఉంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ భూ సమస్య పరిష్కారం కావడం

Updated : 11 Mar 2020 08:12 IST

ఫలించిన జిల్లా సిటిజన్స్‌ కమిటీ ప్రయత్నం
‘ఈనాడు’ కథనానికి స్పందన

 హైదరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ గణేశ్‌నగర్‌లో గంగాధర్‌, భార్య బేబీలు నివాసం ఉంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ భూ సమస్య పరిష్కారం కావడం లేదని భార్యను ఇంట్లోనే వదిలేసి సొంతూరు వెళ్లాడు. ఆమె ఎనిమిది నెలలుగా బయటి ప్రపంచం తెలియకుండా ఇంట్లోనే జీవనం సాగిస్తుంది. ఇంటి యజమానులే ఆహారం అందిస్తున్నారు. ఈ విషయాన్ని గత నెల 27న ‘ఈనాడు’ ప్రచురించిన ‘పెనిమిటీ.. ఇదేమిటి’ వార్తకు హైదరాబాద్‌ జిల్లా దివ్యాంగుల సంక్షేమ, సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీ సహాయ సంచాలకులు పుష్పలత స్పందించారు. బేబీకి వైద్య పరీక్షలు నిర్వహించి ఘట్‌కేసర్‌ కరుణరథం వృద్ధాశ్రమంలో ఉంచారు. బేగంబజార్‌ ఠాణాలో ఫిర్యాదు చేసి భర్త ఆచూకీ కోసం గాలించారు. ఆయన కృష్ణ జిల్లా అవనిగడ్డలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. వెంటనే అక్కడి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. వారు గంగాధర్‌ను గుర్తించి మంగళవారం హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న వృద్ధాశ్రమానికి పంపించేలా ఏర్పాట్లు చేశారు. పుష్పలత అక్కడికి వెళ్లి అతనిని విచారించారు. కొంత కాలంగా తన గ్రామం నాగాయలంకలో స్థలాలు, ఇంటిని కాపాడుకునేందుకు తరుచూ వెళ్తున్నట్లు గంగాధర్‌ వివరించినట్లు చెప్పారు. తాను విశ్రాంత వీఆర్‌వో అని ఇప్పటివరకు పెన్షన్‌ రావడం లేదని వాపోయాడు. ఆయన చెబుతున్న విషయాలను పరిగణలోకి తీసుకొని అధికారులతో విచారణ చేయిస్తామన్నారు.

నేడు విచారణ..: పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డిస్ట్రిక్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సైతం కేసును విచారించింది. నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో గంగాధర్‌ను హాజరు పరుచాలని న్యాయమూర్తి ఆదేశించగా.. అధికారులు బుధవారం తీసుకెళ్లనున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

వీధి మొహం చూడకుండా నాలుగు గోడల మధ్య... ఎవరైనా ఎన్ని రోజులు ఉండగలరు? చాలా కష్టం కదూ. అలాంటిది 72 ఏళ్ల వయసులో.. తాళం వేసిన ఇంటిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోందామె. లోపల ఆహారం లేదు. కరెంటు లేదు. ఉన్న దుస్తుల్నే ఓపిక చేసుకుని ఉతుక్కోవాలి. ఎనిమిది నెలల కిందట ఇల్లు తాళమేసి వెళ్లిపోయిన భర్త ఎప్పుడొస్తాడో తెలియదు.  ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ గణేశ్‌నగర్‌ ఇంటి నంబర్‌ 1-9-129/23/సీ/83 మొదటి అంతస్తులో ఏడాదిన్నర క్రితం గంగాధర్‌, ఆయన భార్య బేబి(72)తో కలిసి అద్దెకు దిగారు. కృష్ణా జిల్లా నాగాయలంక వీఆర్వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందానని, తమకు పిల్లలు లేరని ఇంటి యజమానురాలు శారదకు చెప్పారు. అప్పటి నుంచీ ఆయన బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి వెళ్లేవాడు. ఒకోసారి రెండుమూడు రోజులు వచ్చేవాడు కాదు. తరచూ యజమానురాలే వృద్ధురాలిని బయటి నుంచి పలకరించేవారు. అవసరమైతే అన్నం పెట్టేవారు. ఆంధ్రాలో తన వ్యవసాయ భూమి విక్రయించి వస్తానని చెప్పి గత జులై మొదటి వారంలో వెళ్లిన గంగాధర్‌  తిరిగి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదని, మూడు నెలల కిందట ఒకసారి ఫోన్‌ చేసి, త్వరలో వస్తానని చెప్పినట్లు యజమానురాలు తెలిపారు. అద్దె కట్టడం రెండు రోజులు ఆలస్యమైతేనే ఒప్పుకోని నేటి పరిస్థితుల్లో ఎనిమిది నెలలుగా అద్దె లేకున్నా, ఆ వృద్ధురాలికి అన్నం పెట్టి ఆదుకుంటున్నారు శారద. తమకూ కష్టాలున్నా శారద ‘మాకు ఏ జన్మలో రుణమో’ అంటూ మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. తన భర్త ఎప్పుడొస్తారా అని వృద్ధురాలు బేబి ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని గత నెల 27న ‘ఈనాడు’ ప్రచురించిన ‘పెనిమిటీ.. ఇదేమిటి’ వార్తకు హైదరాబాద్‌ జిల్లా దివ్యాంగుల సంక్షేమ, సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీ సహాయ సంచాలకులు పుష్పలత స్పందించారు. దీంతో గంగాధర్‌ ఎట్టకేలకు భార్య చెంతకు చేరాడు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts