నువ్వు సింహానివైతే.. మరి నేనెవర్నీ..

మీరు అర్జెంటు పనిమీద బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి అప్పుడే బయలుదేరారనుకోండి. ఇంటి గేటు తీసి మూలమలుపు తిరగ్గానే మీరు తప్పించుకోలేనంత దగ్గర్లో మీకు ఓ సింహం ఎదురైతే మీరేం చేస్తారు..?

Published : 11 Mar 2020 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు అర్జెంటు పనిమీద బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి అప్పుడే బయలుదేరారనుకోండి. ఇంటి గేటు తీసి మూలమలుపు తిరగ్గానే మీరు తప్పించుకోలేనంత దగ్గర్లో మీకు ఓ సింహం ఎదురైతే మీరేం చేస్తారు..? కళ్లు మూసితెరిచేలోపు అక్కడి నుంచి పరుగులు పెడతారు కదా..! ఎవరైనా అదే చేస్తారనుకోండి. అయితే, ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి ఎదురైతే ఏమో కానీ.. రోజు ఎదురైతే ఎలా ఉంటుంది. అవును.. స్పెయిన్‌లోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలకు రోజూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కొత్తగా చూసినవాళ్లు భయంతో ఉరుకులూ పరుగులు పెడుతుండగా.. తెలిసినవాళ్లు మాత్రం చూసీ చూడనట్లుగా వెళుతున్నారు. అసలు విషయం ఏంటంటే. అది నిజమైన సింహం కాదు. అదో పెంపుడు శునకం. దాని విచిత్రమైన హెయిర్‌స్టైలే ప్రజలు భయపడటానికి కారణం.

అది సింహం కాదన్న విషయం తొలిసారిగా దాన్ని చూసిన వారెవరూ గ్రహించలేదు. ఎందుకంటే అది అచ్చం సింహంలాగే కనిపిస్తుంది. ఒకరోజు దాన్ని చూసి భయపడ్డ ఓ సిటిజన్‌ పోలీసులకు ఫోన్‌ చేసి ‘ఇక్కడ రోడ్డుపై సింహం తిరుగుతోంది.. వచ్చి బంధించండి’ అని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాని కోసం గాలింపు చేపట్టారు. తీరా అది సింహం కాదు.. గ్రామ సింహం అని తేలేసరికి ఊపిరిపీల్చుకున్నారు. విచిత్రంగా ఉంటుందని యజమాని దానికి ఇలా వెంట్రుకలు కత్తిరించి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఆ గ్రామసింహం కాస్తా ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌ అయింది. దానిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్‌ చేస్తే.. మరోటి ఇలా డెలివరీ చేశారని ఫన్నీగా స్పందిస్తున్నారు. నువ్వు సింహానివైతే.. మరి నేనెవర్నీ అంటూ నిజమైన సింహం ప్రశ్నిస్తున్నట్లుగా ఫొటోలను జత చేస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని