ఆవిడ.. వృద్ధాప్యాన్ని జయించింది

‘రేయ్‌ మామా అర్జెంటుగా బాడీ పెంచాల్రా.. రేపు ఉదయం 6గంటలకు అలారం పెట్టుకో.. ఇద్దరం కలిసి జిమ్‌కు పోదాం.. మిస్‌ చేయొద్దు‌’.. ఇద్దరు స్నేహితుల మధ్య తరచూ చోటుచేసుకునే సంభాషణ ఇది. అయితే, ఆ ఇద్దరిలో ఎవరికీ ఈ మాటలు తర్వాతి రోజు గుర్తుండవు..

Updated : 23 Aug 2022 11:09 IST

అట్టావా(కెనడా): ‘రేయ్‌ మామా అర్జెంటుగా బాడీ పెంచాల్రా.. రేపు ఉదయం 6గంటలకు అలారం పెట్టుకో.. ఇద్దరం కలిసి జిమ్‌కు పోదాం.. మిస్‌ చేయొద్దు‌’.. ఇద్దరు స్నేహితుల మధ్య తరచూ చోటుచేసుకునే సంభాషణ ఇది. అయితే, ఆ ఇద్దరిలో ఎవరికీ ఈ మాటలు తర్వాతి రోజు గుర్తుండవు.. ఒకవేళ గుర్తంచుకొని జిమ్‌లో చేరినా వారం రోజుల్లోపే జిమ్‌కు టాటా చెప్పేవారే ఎక్కువ. కొంతమంది మాత్రం క్రమం తప్పకుండా వెళతారు. అయితే, ఈ కండలు తిరిగిన బామ్మను చూస్తే మాత్రం.. ‘ఇప్పుడు జిమ్‌కు వెళ్లి బాడీ పెంచి ఏం చేస్తాం లే..?’ అనుకునేవాళ్లంతా అర్జెంటుగా జిమ్‌లో చేరిపోవాలనుకుంటారు.

మీకు తెలిసిన వాళ్లలో.. 76ఏళ్ల వయసున్న మహిళలెవరైనా ఉన్నారా..? ఉంటే వారు ఎలా ఉన్నారు. దాదాపు అన్ని శరీర భాగాలు వదులైపోయి. నడవడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా..! చాలామంది అలాగే ఉంటారు. మూడు సంవత్సరాల క్రితం కెనడాకు చెందిన జొవాన్‌ మాక్‌డొనాల్డ్‌ కూడా అలాగే ఉండేది. అధిక బరువు, రక్తపోటుతో పాటు వృద్ధాప్యంలో వచ్చే జబ్బులతో ఇబ్బంది పడేది. 5.3 అడుగుల ఎత్తు 89కిలోల బరువు ఉండే ఆమె ఇప్పుడు ఈ వయసులో ఏకంగా 23కిలోలు తగ్గింది. కేవలం బరువు తగ్గటమే కాదు. కండలు తిరిగిన దేహంతో ఆమె ఒక జిమ్‌ మాస్టర్‌లా తయారైంది. నిత్యం జిమ్‌లో కఠోర సాధన చేయడమే ఇందుకు కారణం. అవసరం ఉన్న వారికి బాడీ బిల్డింగ్‌లో మెలకువలు కూడా నేర్పిస్తోంది. ‘ట్రైన్‌ విత్‌ జోవాన్‌’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ఆమె పాఠాలు చెప్తోంది. ఆ పేజీలో ఆమెను ఏకంగా.. 5,00,000 అనుసరిస్తున్నారు. దీంతో ఆమె సోషల్‌ మీడియాలోనూ సెలబ్రిటీగా మారింది. ఎప్పటికప్పుడు తన జిమ్‌ వీడియోలతో పాటు ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న ఆమె ‘మీరు గడియారాన్ని వెనక్కి తిప్పలేరు, కానీ, దాన్ని ఓడించవచ్చు’ అని అంటోంది. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ఆందోళన ఎందుకు.. సమస్యలను ఎదుర్కొనేందుకు బలం కూడగట్టుకుంటే మేలు కదా..! అందుకే ఆమె వృద్ధాప్యాన్ని సైతం ఓడించి కండలు పెంచుతోంది.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని