ఇక్కడ ఇనుము వర్షం కురుస్తుందట!

భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో అత్యంత వేడిగా ఉన్న అతిపెద్ద గ్రహంలో ఇనుము వర్షంలా పడుతుందని అనుమానిస్తున్నట్లు ఖగోళ శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇది మన సౌరవ్యవస్థ వెలుపల అత్యంత తీవ్రమైన గ్రహాల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

Published : 13 Mar 2020 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో అత్యంత వేడిగా ఉన్న అతిపెద్ద గ్రహంలో ఇనుము వర్షంలా పడుతుందని తెలుస్తోందని ఖగోళ శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇది మన సౌరవ్యవస్థ వెలుపల అత్యంత తీవ్రమైన గ్రహాల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

స్కిట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. మన సౌరవ్యవస్థకి బయట ఉన్న ఈ అతిపెద్ద గ్రహం డబ్ల్యూఏఎస్‌పీ-76బీ నుంచి భూమిని చేరుకోవడానికి 640 కాంతి సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 2400 డీగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత లోహాలను సైతం ఆవిరి చేయగలదు.

ఈ గ్రహంపైనున్న బలమైన గాలులు ఆవిరైన ఇనుముని రాత్రి వేళల్లో చల్లగా ఉన్న ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. అక్కడ ఈ ఆవిరి ఇనుప బిందువులుగా ఘనీభవిస్తుందని ఈ అధ్యయనం గురించి నేచర్‌ జర్నల్‌లో ప్రచురించారు.

ఎలా తెలిసిందంటే...

దక్షిణ అమెరికాలోని చిలీ అటాకామా ఎడారిలోని ఖగోళశాల(ఈఎస్‌ఓ)లోని ఖగోళ శాస్త్రవేత్తలు హై రిజల్యూషన్‌ స్పెక్ట్రోగ్రాఫ్ (ఈఎస్‌పీఆర్‌ఈఎస్‌ఎస్‌ఓ)ను ఉపయోగించి దీనిని కనుగొన్నారు.
ఈ గ్రహంపై వేడి వాతావరణంలో ఇనుప ఆవిరి సమృద్దిగా ఉందని, అది బలమైన గాలుల కారణంగా చల్లటి ప్రదేశాల్లో ఘనీభవిస్తుందని స్పెయిన్‌లోని సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోబయాలజీలో పరిశోధనలు చేసిన మరియా రోసా జపాటెరో ఒసోరియో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని