బకాయి చెల్లించకపోతే బడిత పూజే..!

రాష్ట్రంలో పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది.

Published : 14 Mar 2020 20:49 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. నెలాఖరు నాటికి రూ.1500 కోట్లకు పైగా పన్నులు వసూలు చేయాలని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వాణిజ్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా 1,200 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 380 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రతి బృందంలోనూ ఓ అధికారి, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఒక్కో బృందానికి 150 మంది బకాయిదారులను అప్పగించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ కోసం ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ను సిద్ధం చేశారు. వీటిలో బృందాలకు అప్పగించిన మొండి బకాయిదారుల వివరాలు నిక్షిప్తం చేశారు. ఈ సమాచారం ఆధారంగా అధికారులు వారికి కేటాయించిన మొండి బకాయిదారులకు ఫోన్‌ చేస్తారు. వారు స్పందిస్తే బకాయి చెల్లించాలని చెబుతారు. అప్పటికీ చెల్లించడానికి ముందుకు రాకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని  నిర్ణయించారు.

తనిఖీలు నిర్వహించి వ్యాపారస్తుడు చెప్పినట్లుగా అక్కడ పరిస్థితి లేకపోతే  సీజ్‌ చేసి బకాయి చెల్లించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన 60,000 మంది దాకా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది.  ప్రధానంగా కేంద్ర అమ్మకపు పన్ను, వ్యాట్‌, ఆడిట్‌ కేసులు కోర్టులో స్టే లేని కేసులు, తప్పుడు జీఎస్టీ రిటర్న్‌లు వేసిన కేసులు ఇలా వివిధ రకాల మొండి బకాయిదారులపై ఆ శాఖా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే 30వేల మందికి నోటీసులు ఇచ్చారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని