
కరోనాపై భట్టి Vs కేసీఆర్
హైదరాబాద్: కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరిపేరూ ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనాలాంటి సున్నిత అంశాల్లో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. తెలంగాణ అసెంబ్లీలో కరోనా వైరస్‌పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..కరోనాపై ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అనేక దేశాల్లో కరోనా వ్యాప్తి చెందిందన్నారు. ఈ మహమ్మారి గురించి నవంబర్ నుంచే వార్తలు వస్తున్నాయన్నాయన్న భట్టి.. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్నారు. వైరస్ నియంత్రణకు కేంద్రం సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రం కాలర్‌ట్యూన్ పెట్టి వదిలేసింది తప్ప సీరియస్‌గా తీసుకున్నట్టు కనబడటంలేదని ఆరోపించారు.
భట్టి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ముఖ్యమంత్రి.. కరోనా లాంటి సున్నిత అంశాల్లో రాజకీయం చేయడంసరికాదని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయన్నారు. ప్రజల్ని భయాందోళనకు గురిచేసేలా మాట్లాడొద్దన్న సీఎం.. సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూడటం మంచిది కాదన్నారు. ‘‘కరోనా నియంత్రణకు కేంద్రం ఏమీ చేయలేదనే మాటలు సరికాదు. కేంద్రం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశాల నుంచి రాకపోకలను నిలిపివేసింది. ఇలాంటి సమయంలో నాయకులు బాధ్యతగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని భయాందోళనకు గురిచేయొద్దు. ఎవరో ప్రచారం చేశారని కొన్ని ప్రాంతాలను బదనాం చేయొద్దు. విమానాశ్రయంలో 200 మంది వైద్య సిబ్బంది ఉంచాం. వారు 24గంటలూ పనిచేస్తున్నారు. కరోనా ప్రబలితే దూలపల్లి, వికారాబాద్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం’’ అని వివరించారు.