మౌలాలి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌ పరిధిలోని మౌలాలి రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైల్వే బోగీలో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో

Published : 14 Mar 2020 19:44 IST

చర్లపల్లి: సికింద్రాబాద్‌ పరిధిలోని మౌలాలి రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైల్వే బోగీలో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోగీ పూర్తిగా దగ్ధమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ టౌన్‌ నుంచి సికింద్రాబాద్ వెళ్లే స్పెషల్ రైలు (07054) శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులందరూ దిగిన తర్వాత రైలును మౌలాలి యార్డుకు తరలించారు. ఉదయం 10.30 గంటల సమయంలో రైలులోని రెండో బోగీలో పొగలు రావడాన్ని గమనించిన మౌలాలి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉస్మాన్ వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. మల్లాపూర్, చర్లపల్లి నుంచి వచ్చిన రెండు ఫైర్ ఇంజిన్‌లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అప్పటికే మంటలు వ్యాపించడంతో బోగి 80 శాతం మేర కాలిబూడిదైంది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. బోగీలో ఓ మద్యం సీసా, కాల్చిపారేసిన సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టేను క్లూస్‌టీం బృందం సేకరించింది. మంటలు మిగతా బోగీలకు వ్యాపించకపోవడం వల్ల నష్ట తీవ్రత తగ్గినట్లు అధికారులు తెలిపారు. రైలు నిలిపి ఉండడంతో విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశమే లేదని.. ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని