భారత్‌లో కరోనా: ఏం చేయాలి? ఏం చేయొద్దు?

చైనాలో ఉత్పన్నమైన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావితం చేస్తున్న ఈ కరోనా భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. .......

Updated : 09 Dec 2021 16:38 IST

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇస్తున్న సూచనలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్: చైనాలో ఉత్పన్నమైన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతోన్న ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 7130 మృత్యువాత పడగా.. 1,79,823 కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో మూడు మరణాలు చోటుచేసుకున్నాయి. రోజు రోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఒక్కోచోట ఒక్కోరకమైన సమాచారం లభ్యమవుతుండటంతో అసలు ఇప్పటివరకు భారత్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఏయే రాష్ట్రాల్లో ఈ వైరస్‌ ప్రభావం ఉంది? ఎక్కడెక్కడ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు? తదితర సమాచారంలో కొంత గందరగోళం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడంతో పాటు దీని కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచిస్తూ అప్రమత్తం చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..

భారత్‌లో ఎన్ని కేసులు?
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం మన దేశంలో ఇప్పటివరకు 126 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడగా.. ఈ వైరస్‌ బారిన పడి 13 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  

ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. ఏపీ 1; దిల్లీ 7 (+ ఒకరి మృతి); హరియాణా 15; కర్ణాటక 8 (+ ఒకరి మృతి); కేరళ 24; మహారాష్ట్ర   39 (+ ఒకరి మృతి); ఒడిశా 1; పంజాబ్‌ 1; రాజస్థాన్‌ 4; తమిళనాడు 1; తెలంగాణ 4; జమ్మూకశ్మీర్‌ 3; లద్దాఖ్‌ 4; ఉత్తర్‌ప్రదేశ్‌ 13; ఉత్తరాఖండ్‌ 1 చొప్పున నమోదయ్యాయి. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదనే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పలు కీలక సూచనలు చేసింది.

కరోనా కట్టడికి  ఏం చేయాలి

* తరచూ సబ్బు, నీళ్లతో చేతుల్ని 40 సెకెన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్లతో అయితే 20 సెకెన్ల పాటు శుభ్రంచేసుకోవాలి.  

* దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా చీదినప్పుడు హ్యాండ్‌ కర్చీఫ్‌/ టిష్యూ పేపర్‌/ మోచేయిని అడ్డంగా పెట్టుకోవాలి. 

*  టిష్యూలను వాడిన వెంటనే వాటిని చెత్తబుట్టలో పడేయాలి.

*  జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించేటప్పుడు ముఖానికి మాస్క్‌ లేదా ఏదైనా వస్త్రాన్ని ముఖానికి కట్టుకోవాలి.

*  ఈ వైరస్‌ లక్షణాలు ఉంటే గనక మీ రాష్ట్రం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌కు లేదంటే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన 011-23978046కు ఫోన్‌ చేయాలి. 

* సామాజిక దూరం పాటించాలి. 

హెల్ప్‌లైన్‌ కేంద్రాల జాబితా కోసం క్లిక్‌ చేయండి

ఏం చేయకూడదు?

* దగ్గు, జ్వరం ఉంటే ఎదుటివారికి దూరంగా ఉండండి. 

* కళ్లు, ముక్కు, నోటి భాగాలను చేతులతో తాకొద్దు.

* బహిరంగంగా ఉమ్మి వేయొద్దు.

కొవిడ్‌ 19 పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి?

దగ్గు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్‌ ప్రభావిత దేశాలైన ఇటలీ, ఇరాన్‌, కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర దేశాలకు వెళ్లినవారైతే ఈ పరీక్షలు చేయించుకోవాలి. మీరులేబోరేటరీకి వెళ్లి పరీక్షించుకున్నప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలితే మీ రాష్ట్రంలోని హెల్ప్‌లైన్‌ నంబర్‌ లేదా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలి. ఈ హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. 

టెస్టింగ్ ల్యాబ్‌లు ఎక్కడెక్కడ?

దేశవ్యాప్తంగా  కరోనా వైరస్‌ కేసులు  బయటపడుతున్న వేళ  జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలతో ఉన్న వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం పుణెలో వైరాలజీ ల్యాబ్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో మొత్తం 52 వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబోరేటరీ (వీఆర్‌డీఎల్‌)లు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (స్విమ్స్‌- తిరుపతి), ఆంధ్రా మెడికల్‌ కాలేజీ (విశాఖపట్నం), ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ (అనంతపురం)తో పాటు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఈ ల్యాబ్‌లు ఉన్నాయి. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి ఈ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ పుణెలోని వైరాలజీ ల్యాబ్‌లో నిర్ధారణ అయిన తర్వాతే పాజిటివ్‌ కేసులను అధికారికంగా ప్రకటిస్తున్నారు.

టెస్టింగ్‌ ల్యాబొరేటరీల జాబితా కోసం క్లిక్‌ చేయండి 

ఇంట్లో క్వారెంటైన్‌.. జాగ్రత్తలేంటి? 

ఒకవేళ  ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా/ అనుమానిత లక్షణాలు ఉన్నా ఆ రోజు నుంచి 14 రోజుల పాటు క్వారెంటైన్‌ చేయాలి. బాధితులను బాగా వెలుతురు ఉండే గదిలో ఉంచాలి. ఆ గదికి అటాచ్‌డ్‌/ సింగిల్‌ టాయిలెట్ ఉండేలా చూడాలి. బాధితుడితో పాటు కుటుంబ సభ్యులెవరైనా ఉండాలనుకుంటే ఇద్దరి మధ్యా కనీసం 1 మీటర్‌ దూరం పాటించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులతో పాటు ఇంట్లో అనారోగ్యంతో ఎవరైనా ఉంటే బాధితులకు దూరంగా ఉండాలి. కరోనా లక్షణాలు ఉన్నవారి కదలికలను నియంత్రించాలి. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాగ్రత్త వహించాలి.

బాధితులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కరోనా అనుమానిత/ నిర్ధారిత వ్యక్తులు సబ్బు, నీళ్లతో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆల్కాహాల్‌తో తయారుచేసిన శానిటైజర్లను వాడాలి. ఇంట్లో వాడే వస్తువులకు దూరంగా ఉండాలి. సర్జికల్‌ మాస్క్‌లను ఎల్లప్పుడూ వాడాలి. మాస్క్‌ను 6 - 8గంటలకు ఒకసారి మార్చాలి. వాడిన మాస్క్‌ను మళ్లీ వాడకుండా దాన్ని చెత్తబుట్టలో వేయాలి. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.

బాధితుల కుటుంబ సభ్యులకు సూచనలివీ..

* ఇంట్లో క్వారెంటైన్‌ చేసిన వ్యక్తి బాగోగులను చూసుకొనేందుకు కుటుంబంలో ఒకరిని కేటాయించాలి.

* బాధితుడితో కరచాలనానికి, అతడిని తాకేందుకు దూరంగా ఉండాలి. 

* వారికి సంబంధించిన వస్తువులను తాకినప్పుడు, గదిని శుభ్రం చేసినప్పుడు తప్పకుండా గ్లౌజులను వాడాలి. ఆ గ్లౌజులను తీసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

* బాధితుడిని ఇతరులెవరూ కలిసేందుకు అనుమతించొద్దు.

* కుటుంబ సభ్యులు మాత్రం మూడు లేయర్ల మెడికల్‌ మాస్క్‌లను ధరించడం మంచిది. ఈ మాస్క్‌ 8గంటల వరకే పనిచేస్తుంది. ఆతర్వాత దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని