కరోనా: స్మార్ట్‌ ఫోన్‌ శుభ్రం చేయడం ఎలా?

ప్రపంచాన్ని కొవిడ్‌ - 19 (కరోనా) మహమ్మారి భయపెడుతోంది. ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో తెలియక జనాలు భయపడుతున్నారు.

Published : 18 Mar 2020 13:20 IST

ప్రపంచాన్ని కరోనా(కొవిడ్‌- 19) మహమ్మారి భయపెడుతోంది. ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో తెలియక జనాలు భయపడుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం.. వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనాను దూరం పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మనం రోజు వాడే వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్‌ అతి ముఖ్యమైనదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మొబైల్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలి. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి చూద్దామా.. 

స్మార్ట్‌ ఫోన్లలోనూ బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని, మొబైల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని 2017లో అమెరికన్‌ మెడికల్‌ జర్నల్‌ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అయితే అప్పుడు దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్యాడ్జెట్ల శుభ్రత గురించి చర్చ జరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్‌ శుభ్రత కోసం ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

మీ ఫోను శుభ్రపరచడానికి 70 శాతం ఐసోప్రోపైల్‌ ఆల్కహాల్‌ ఉన్న క్రిమిసంహారక తొడుగులను మాత్రమే వాడాలి. శుభ్రపరిచేటప్పుడు వాడి పడేసే వీలున్న చేతి తొడుగులను ఉపయోగించండి. కళ్లజోళ్లను శుభ్రం చేయడానికి వినియోగించే మృదువైన, కొంచెం తడిగా ఉన్న మొత్తటి వస్త్రాన్ని మొబైల్స్ కోసం వాడొచ్చు.  అలాగే ఫోనుపై క్రిమిసంహారక ద్రావణం వేసిన తర్వాత దానిని చేతితో తుడవకుండా... టిష్యూ పేపర్లను వాడడం మంచిది. ఐపీ68 రేటింగ్‌ నీటి నిరోధకత ఉన్న స్మార్ట్‌ ఫోనులను సబ్బు నీరు లేదా శానిటైజర్‌లతో శుభ్రం చేయవచ్చు. ఆఖరిగా మీ ఫోను శుభ్రం చేయడం పూర్తయిన తరువాత తప్పని సరిగా మీ చేతులను సబ్బుతో కడుక్కోవాలి.

స్మార్ట్‌ ఫోన్లను శుభ్రపరచడానికి బ్లీచ్‌, వెనిగర్‌ లాంటివి ఉపయోగించకూడదు. ఐఫోన్‌ శుభ్రపరచడానికి స్ప్రే క్లీనర్లను నేరుగా ఉపయోగించకూడదని యాపిల్‌ సంస్థ చెబుతోంది. అలాగే ఫోనును పూర్తిగా శుభ్రపరచడానికి ఎలాంటి ద్రవాల్లో ముంచకూడదు. దీంతోపాటు ఆల్కహాల్‌ని నేరుగా ఉపయోగించడం ప్రమాదకరం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని