ఏపీలో ‘కోడ్‌’ సడలింపు..ఆదేశాలు జారీ

స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్‌ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు...

Updated : 30 Aug 2022 15:28 IST

అమరావతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్‌ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు కాపీ విడుదలైంది. తీర్పు కాపీలో విచారణలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పేర్కొంది. స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కేవియట్ దాఖలు చేసింది. బుధవారం ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులు ఆగాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలను వాయిదా వేసి కోడ్ కొనసాగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కొత్త ఎన్నికల తేదీకి 4 వారాల ముందు కోడ్‌ అమల్లోకి తేవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.  తదుపరి తేదీ ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్‌ఈసీకి సూచించింది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపట్టాలంటే ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు తీర్పు కాపీలో న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని