శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తు్న్న తరుణంలో కొంతమంది విదేశీయులు నిర్బంధ పరిశీలన కేంద్రాలకు...

Published : 19 Mar 2020 19:08 IST

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తు్న్న తరుణంలో కొంతమంది విదేశీయులు నిర్బంధ పరిశీలన కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరించే అవకాశం ఉన్నందున పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది ప్రయాణికులు విదేశాల నుంచి వస్తున్నా మాట మార్చి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నట్లుగా అధికారులను నమ్మిస్తున్నారు. ఐదు రోజుల క్రితం ఇలా కొంతమంది ప్రయాణికులు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోకుండా వెళ్లిపోవడంతో ఆర్‌జీఐఏలో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తాయి.

తాజాగా ఆర్‌జీఐఏలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేరుగా రంగంలోకి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని స్వయంగా పరిశీలిస్తున్న ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. క్వారంటైన్‌కు తరలిస్తున్న ప్రయాణికుల వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వారిని తీసుకెళ్లేందుకు వచ్చే వాహనాలను మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే విమానాలను హజ్‌ టెర్మినల్‌ వద్దే నిలుపుతున్నారు. అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వచ్చే వారి బంధువులు, కుటుంబసభ్యులు హజ్‌ టెర్మినల్‌ వద్దకే రావాలని విమానాశ్రయ అధికారులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని