గ్రహశకలం భూమిని ఢీకొట్టదు: నాసా

2020లో భూమి అంతం కానుందని, ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందంటూ ఓ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు.....

Updated : 20 Mar 2020 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020లో భూమి అంతం కానుందని, ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందంటూ ఓ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద గ్రహశకలం ఈ ఏప్రిల్‌ 19న భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గతంలో వెల్లడించింది. అయితే, ఆ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందన్నది ఆ ప్రచార సారాంశం. ఇందులో నిజమెంత..?

ఏప్రిల్‌ 19న భూమికి సమీపంగా ఓ గ్రహశకలం వెళ్లనుందని మూడేళ్ల క్రితం నాసా వెల్లడించింది. దాదాపు 2వేల అడుగుల పరిమాణం గల జేఓ25 అనే గ్రహశకలం (స్పేస్‌రాక్‌) భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని ఓ వార్త సంస్థ తెలిపింది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుందని పేర్కొంది. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఇలాంటి గ్రహ శకలాలు చాలా సార్లు భూమికి అతి సమీపంగా వెళ్లాయి. ఇంతవరకు భూమికి ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.

అయితే, ఈ గ్రహశకలం పరిమాణం వాటన్నింటికంటే చాలా పెద్దది. 2004 సెప్టెంబర్‌లో ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత గల టౌటాటిస్‌ అనే గ్రహశకలం ఒకటి భూమి నుంచి 4 లూనార్లు (ఒక లూనర్‌- చంద్రుడి నుంచి భూమికి మధ్య గల దూరం)తో దూసుకెళ్లింది. రాబోయే గ్రహశకలం టౌటాటిస్‌ కంటే కూడా పెద్దది. గడిచిన 400ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం ఇదే అని నాసా పేర్కొంది. దీంతో ఆ గ్రహశకలం భూమికి తాకుతుందని, ఆ తర్వాత భూగ్రహం అంతమవుతుందని వార్తలు వ్యాపించాయి. అయితే, ఏప్రిల్‌ 19 తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు ద్వారా ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని నాసా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని